logo

ఆమె.. చుట్టూ సైబర్‌ వల!

ఇంటా.. బయటా మాత్రమే కాదు. అర చేతిలోకి చేరిన స్మార్ట్‌ఫోన్‌. ప్రపంచాన్ని దగ్గర చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమె పాలిట ముప్పుగా మారింది. చదువు పూర్తయి కొలువు కోసం అన్వేషించే యువతులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకుంటూ

Updated : 05 Jul 2022 11:39 IST

పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో టోకరా

మహిళలే లక్ష్యంగా చెలరేగుతున్న మాయగాళ్లు

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటా.. బయటా మాత్రమే కాదు. అర చేతిలోకి చేరిన స్మార్ట్‌ఫోన్‌. ప్రపంచాన్ని దగ్గర చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమె పాలిట ముప్పుగా మారింది. చదువు పూర్తయి కొలువు కోసం అన్వేషించే యువతులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకుంటూ భర్తకు చేదోడుగా ఉండాలనుకునే గృహిణులు, కళాశాలకు వెళ్తూనే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగావకాశాలు వెతికే విద్యార్థినులు, ఏదో రూపంలో ఇంటికి అండగా నిలవాలని భావించే మహిళలను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ మోసగాళ్లు చెలరేగుతున్నారు. కమీషన్‌కు ఆశపడే ఏజెంట్ల ద్వారా జాబ్‌ పోర్టల్‌లో రెజ్యూమె ఉంచిన ఉద్యోగార్థులు, బ్యాంకు ఖాతాలున్న మహిళలు, యువతుల వివరాలు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి మోసపోయినట్టు గ్రహించిన బాధితులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకోవద్దని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ జి.శ్రీధర్‌ సూచిస్తున్నారు.

మోసమని తెలియక..

* నిజాంపేటకు చెందిన గృహిణి. బీటెక్‌ చదివినా కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇటీవల ఆమె వాట్సప్‌ నంబరుకు టెలిగ్రామ్‌ నంబరు నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ప్రతిరోజూ 10-30 నిమిషాలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదికగా వినియోగదారుల నుంచి ఆర్డర్స్‌ తీసుకుంటే కమీషన్‌ ఇస్తామనేది సారాంశం. నిర్వాహకులు పంపిన వెబ్‌సైట్‌లో బ్యాంకు ఖాతాలు సహా అన్ని వివరాలు ఆమె నమోదుచేశారు. వారిచ్చిన లక్ష్యాలు పూర్తిచేస్తున్న కొద్దీ ఆమె బ్యాంకు ఖాతాల్లో నగదు జమవడం వర్చువల్‌గా కనిపించేవి. రూ.7,08,439 నగదు విత్‌డ్రా చేసుకునేందుకు రూ.6.50లక్షలు జమ చేయాలన్నారు. తరువాత కొద్ది రోజులకే ఖాతాలో రూ.5,22,064 మాయమయ్యాయి.

* జగద్గిరిగుట్టలో బీటెక్‌ విద్యార్థినికి ఇంట్లో ఉండి ఉద్యోగం చేయవచ్చని వాట్సప్‌ నంబరుకు వెబ్‌సైట్‌ లింకు పంపారు. తమ ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజూ రూ.500-1000 సంపాదించవచ్చన్నారు. వారిచ్చిన ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో లావాదేవీలు నిర్వహిస్తే కమీషన్‌ జమ చేస్తున్నట్టు నమ్మిస్తూ రూ.2.54లక్షలు కాజేశారు.

* కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ గృహిణి నగలు తాకట్టు పెట్టి రూ.3లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లో ఉంచి మోసపోయింది. భర్తకు తెలిస్తే సంసారం పాడవుతుందనే భయంతో ఆత్మహత్యకు యత్నించింది.

* పెరిగిన ఖర్చులు, పిల్లల చదువుల నేపథ్యంలో భర్తకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో, పార్ట్‌టైమ్‌ జాబ్‌ అని నమ్మి మోసపోయానని కేపీహెచ్‌బీకి చెందిన ఓ గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు.

* కొవిడ్‌ వేళ ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆన్‌లైన్‌ బారినపడి మోసపోయినట్టు సరూర్‌నగర్‌కు చెందిన ఓ బాధితురాలు వాపోయారు. ఎంటెక్‌ చేసిన తాను జాబ్‌ పోర్టల్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం రెజ్యూమె ఉంచానని, ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగమంటూ జూమ్‌ ద్వారా ఇంటర్వ్యూలు చేసి రూ.45,000 ప్రాసెసింగ్‌, మెడికల్‌ ఫీజులంటూ మోసగించారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని