logo
Published : 05 Jul 2022 01:53 IST

నల్లా పేరుతో గల్లా నింపుడు!

కొత్త కనెక్షన్‌కు అన్నీ చెల్లించినా అడ్డగోలు వసూళ్లు

జలమండలి గ్రీన్‌ బ్రిగేడ్‌ గుత్తేదారు నిర్వాకం

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి తన కొత్త ఇంటికి 20 ఎంఎం నల్లా కోసం జలమండలికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.2 వేల రుసుం చెల్లించాడు. ఇంటి డ్యాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేశాడు. కొన్నిరోజుల తర్వాత కొత్త నల్లా మంజూరు అయినట్లు జలమండలి నుంచి సమాచారం అందింది. అందుకు కనెక్షన్‌, మురుగు నిర్వహణ, రోడ్డు కటింగ్‌, మళ్లీ పూడ్చడం, సంపు వద్ద మీటరు బిగించడం తదితరాలకు మరో రూ.23 వేలు చెల్లించాడు. దీంతో సంబంధిత ఏరియా గ్రీన్‌ బ్రిగేడ్‌ (జీబీ) కాంట్రాక్టర్లకు సమాచారం వెళ్లింది. రోడ్డు కటింగ్‌ నుంచి ప్రధాన పైపులైన్‌ నుంచి ఇంటి సంపు వరకు పైపు వేసే పనంతా వారే చేస్తారు. అన్నీ చెల్లించినా వీరు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అంటే కొత్త నల్లాల బిగింపులో గ్రీన్‌ బ్రిగేడ్‌ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం. కొందరు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అక్రమ నల్లాలు పెరగటానికి వీరూ కారణమనే విమర్శలున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా జలమండలికి 250 జీబీ గుత్తేదారు ఏజెన్సీలున్నాయి. జలమండలి ఇచ్చే కమీషన్‌తోపాటు నల్లాదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. జలమండలి అధికారులతో మంచి సంబంధాలుండటంతో వీరిపై ఫిర్యాదులు చేసినా చర్యలుండవు.

అక్రమాల తంతు ఇలా..

* ఎల్‌బీనగర్‌లో ఇద్దరు జీబీ గుత్తేదారులు వేర్వేరు పేర్లతో 3, 4 ఏజెన్సీలు నడుపుతున్నారు. నల్లాల జారీలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు కొన్నేళ్లుగా వీరిపై ఆరోపణలున్నాయి. 15 ఎంఎం కనెక్షన్‌కు ఒక రేటు.. 20 ఎంఎంకు మరో రేటు వసూలు చేస్తున్నారు.

* హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఒక జీబీ గుత్తేదారు 2 ఏజెన్సీలు నడుపుతున్నాడు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో వాణిజ్య నల్లాలు జారీ చేస్తుంటారు. భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

* ఎస్‌ఆర్‌ నగర్‌, నారాయణగూడ పరిధిలోని ముగ్గురు జీబీ గుత్తేదారులకు ఒకటికంటే ఎక్కువ ఏజెన్సీలే ఉన్నాయి.

* ప్రధాన పైపులైన్‌ నుంచి ఇంటి వరకు అవసరమైన 35 మీటర్ల పైపును జలమండలే ఇస్తుంది. చాలామంది జీబీ గుత్తేదారులు జలమండలి స్టోర్స్‌ నుంచి మాత్రం సరిపోను పైపులు తీసుకుని నల్లాదారులకు 10 మీటర్లకంటే ఎక్కువ ఉచితంగా ఇవ్వడం లేదు. మిగిలిన దానికి వసూళ్లు చేస్తున్నారు.

* చాలా సర్కిళ్లలో ఏళ్ల తరబడి పాత గుత్తేదారులే ఉన్నారు. కొందరైతే తమ బంధువులను, కుటుంబ సభ్యుల పేరుతో అదనంగా ఏజెన్సీలు పొందుతున్నారు. కొత్తవారికి అవకాశం రాకుండా చేస్తున్నారు.

* ప్రతి నల్లాకు మీటరుండాల్సిందే. అప్పుడే నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా అందుతుంది. అందుకు వినియోగదారులే మీటరు తెచ్చుకోవాలి. అయితే ఆ అవసరం లేకుండా జీబీ గుత్తేదారులే సరఫరా చేస్తూ వినియోగదారుని పిండుకుంటున్నారు. 15 ఎంఎం సైజు పైపునకు పట్టే మీటరు రూ.1200 ఉంటే వీరు రూ.2 వేలకుపైనే వసూలు చేస్తున్నారు. 20 ఎంఎం సైజు పైపునకు పట్టే మీటరు రూ.2 వేలుంటే రూ.3 వేలకుపైనే తీసుకుంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని