logo

ఎల్లమ్మ కల్యాణం చూతము రండి

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉత్తరా నక్షత్ర యుక్త కన్యా లగ్న సుముహుర్తాన ఉదయం 11.45 గంటలకు దేవస్థానం ముందు ఉన్న రాజమార్గంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో వేద పండితులు

Published : 05 Jul 2022 01:53 IST

ఎదుర్కోలు కార్యక్రమంలో ఊరేగింపుగా

వెళ్తున్న వధూవరులు, పాల్గొన్న భక్తులు

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉత్తరా నక్షత్ర యుక్త కన్యా లగ్న సుముహుర్తాన ఉదయం 11.45 గంటలకు దేవస్థానం ముందు ఉన్న రాజమార్గంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో వేద పండితులు ఈ వేడుకను కనుల పండువగా జరపనున్నారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి తలసాని అమ్మవారి కల్యాణం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

మహోత్సవాలు ప్రారంభం

ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఎల్లమ్మ అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేశారు. సాయంత్రం 7 గంటలకు గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎల్లమ్మ దేవస్థానం నుంచి సంజీవరెడ్డినగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు అమ్మవారిని ఊరేగింపుగా మేళతాళాలతో భక్తుల కోలాహలం నడుమ తీసుకువెళ్లారు. అక్కడ ఆలయ ఛైర్మన్‌ బొడ్డు కుమార్‌ గౌడ్‌, ఈవో జి.సుధాకర్‌, ఆలయ అర్చకులు కె.వేణుగోపాలాచార్యులు పట్టువస్త్రాలను ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణకు అందజేశారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో పుట్ట బంగారం, గంగ తెప్ప, ఒగ్గుకథ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో అమీర్‌పేట కార్పొరేటర్‌ కేతినేని సరళ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సతీసమేతంగా సోమవారం రాత్రి దర్శించుకున్నారు.

నేడు బంగారు బోనం సమర్పణ

చాంద్రాయణగుట్ట: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్‌ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ఊరేగింపు కమిటీ ఛైర్మన్‌ రాకేశ్‌ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. సప్త మాతృకలకు సప్తబోనాలు కార్యక్రమంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సుల్తాన్‌షాహీ జగదాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా బల్కంపేట తరలివెళ్లి ఎల్లమ్మ తల్లికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని