logo

తనిఖీలు శూన్యం... తరుణి సొమ్ము మాయం..!

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు అందిస్తున్న స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు వాయిదాలు చెల్లించినా బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడేస్తున్నారు. సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న

Updated : 05 Jul 2022 05:47 IST

సంవత్సరాలుగా స్త్రీ నిధి కిస్తుల స్వాహా

ఇటీవలి సామాజిక తనిఖీల్లో వెల్లడి

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

వివరాలు ఆరా తీస్తున్న సిబ్బంది

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు అందిస్తున్న స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు వాయిదాలు చెల్లించినా బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడేస్తున్నారు. సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజా సామాజిక తనిఖీలతో వెల్లడైంది. బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయడంతోపాటు చర్యలు చేపట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

పారదర్శకంగా ఉన్నా ....

జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామీణ మహిళలకు మహిళా సమాఖ్యల ద్వారా, పట్టణ ప్రాంత మహిళలకు మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. ఎలాంటి తనఖా లేకుండా రూ.25 వేల నుంచి రూ.3లక్షల దాకా వ్యక్తిగత రుణాల్ని అందజేస్తున్నారు. వాటిని తిరిగి 60 నెలల సులభ వాయిదాల్లో చెల్లించేలా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ఇంత పారదర్శకంగా ఉన్నా రుణ వాయిదాల వసూళ్లల్లో కొందరు అక్రమాలకు తెర లేపారు.

అధికారుల నిర్లక్ష్యం

ఏళ్ల తరబడి అవకతవకలు సాగుతున్నా అధికారులు గుర్తించలేకపోయారు. ఐనెల్లిలో ఒక్కో మహిళ నుంచి దాదాపు రూ.వెయ్యి చొప్పున నెలనెలా అదనంగా వసూలు చేసినా గమనించలేదు. నాలుగు సంవత్సరాలుగా అదనపు వసూళ్లకు పాల్పడుతుంటే గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని తీవ్ర విమర్శలొస్తున్నాయి. కనీసం ఇకముందైనా తనిఖీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అనుమానం వచ్చిందిలా..

రుణాల్ని సద్వినియోగం చేసిన మహిళల పేరిట కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు బకాయి ఉంటున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలోని స్త్రీనిధి మండల సమన్వయకర్తలు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే తాము నెలనెలా వాయిదాల సొమ్మును సీసీ, అధ్యక్షురాలికి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అనుమానం వచ్చిన సిబ్బంది మరింత మంది బకాయిదారులను సంప్రదించినా ఇదే సమాధానం రావడంతో ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీలు, బహిరంగ విచారణ జరిపించాలంటూ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర కార్యాలయం అధికారులకు నివేదించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో మూడు రోజులుగా బహిరంగ విచారణ చేపట్టింది.

ఏడు గ్రామాలు, పట్టణంలో..

తొలుత తాండూరు మండలం ఐనెల్లిలో సుదీర్ఘంగా మూడు రోజుల పాటు విచారణ జరిపిన బృందం ఏకంగా రూ.21.50 లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. ఇక్కడి సభ్యులు నెలకు రూ.1,530లను వాయిదాగా చెల్లించాల్సి ఉంటే సీసీ, అధ్యక్షురాలు రూ.2,500ల చొప్పున వసూలు చేసినట్లు గుర్తించారు. 2018-19 నుంచి ఇలా అధిక వసూళ్లకు పాల్పడినట్లు నిగ్గు తేల్చారు. అల్లాపూర్‌లో వీఓఏ యూసుఫ్‌ రూ.5.70లక్షలు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. కరణ్‌కోటలోని మూడో గ్రామ సంఘంలో రూ.1.79లక్షలు, జిన్‌గుర్తిలో వీఓఏ శివరాం రూ.1.40లక్షలు, కోటబాస్పల్లిలో రూ.60వేలు, గుండ్లమడుగు తండాలో రూ.58వేలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. పట్టణంలోని పసారి వార్డులో మెప్మా ద్వారా రుణాలు అందించగా అక్కడి సభ్యులు రూ.1.70లక్షలు చెల్లించాల్సి ఉందని, రూ.1.75లక్షలు అధ్యక్షురాలి నుంచి రాబట్టాల్సి ఉన్నట్లు తేల్చారు. పెద్దేముల్‌ మండలం మారెపల్లిలోనూ సామాజిక తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానుంది.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం : తుమ్మల వేణు, రీజినల్‌ మేనేజరు, స్త్రీనిధి

మూడు రోజులుగా నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల ద్వారా సీసీలు, వీఓఏలు, అధ్యక్షురాలు వాయిదాల సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు గుర్తించాం. తనిఖీలు పూర్తయిన తరువాత నివేదికను డీఆర్‌డీఓ ద్వారా ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయడంతోపాటు సస్పెండ్‌ చేసి సెర్ఫ్‌కు సరెండర్‌ చేసే చర్యలు ఉంటాయి.

జిల్లాలో గ్రామ సమాఖ్యలు 657

స్వయం సహాయక సంఘాలు 15,766

నమోదైన సభ్యులు: 1,69,706

నిర్దేశించిన స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.78.30 కోట్లు

సామాజిక తనిఖీలు చేసింది 9 గ్రామాల్లో

దుర్వినియోగమైన సొమ్ము రూ.34.92లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని