logo

శిక్షణతో సరి.. యంత్రాలు లేవు మరి..!

జిల్లాలోని కుమ్మరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి తీసుకున్న చర్యలు ఆదిలోనే నీరు గారిపోయాయి. నేటి కంప్యూటర్‌ యుగంలో గ్రామాల్లో నివసించే కుమ్మరులు

Published : 05 Jul 2022 01:53 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: జిల్లాలోని కుమ్మరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి తీసుకున్న చర్యలు ఆదిలోనే నీరు గారిపోయాయి. నేటి కంప్యూటర్‌ యుగంలో గ్రామాల్లో నివసించే కుమ్మరులు తమ చక్రంపైనే మట్టితో కుండలు, ఇతర పాత్రలు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల ద్వారా సులభంగా పాత్రలను తయారు చేయవచ్చని బీసీ అధికారులు తెలిపి వారిని శిక్షణ వైపు మళ్లించారు. తరువాత వీరి గురించే మరిచిపోయారు.

రూ.20 వేలు కట్టించుకున్నారు

మూడు సంవత్సరాల క్రితం జిల్లాలోని చురుకైన అర్హత కల్గిన 200 మంది యువకులను గుర్తించి యంత్రాల ద్వారా మట్టితో వస్తువులు, ఇతర పాత్రలు చేసే వాటిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో నెల, రెండు నెలల పాటు ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో కొంత మందికి మట్టితో విగ్రహాలను, పాత్రలు తయారు చేసే యంత్రాలను ఇప్పిస్తామని ఒక్కక్కరి వద్ద రూ. 20 వేలు కట్టించుకున్నారు. ఇప్పటికీ వారికి యంత్రాలు పంపిణీ చేయలేదు. యంత్రాలు వస్తాయని కుమ్మరులు మాత్రం ఆశగా చూస్తున్నారు.

జిల్లా అధికారికి విన్నవించినా..: డబ్బులు చెల్లించిన వారికి యంత్రాలు ఇప్పించాలని కోరుతూ ఇటీవల కలెక్టర్‌ కార్యాలయానికి కుమ్మరులు వచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతులు అధికారి ఉపేందర్‌ను కలిసి తమ గోడును వినిపించారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు యంత్రాలు పంపిణీ చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టితో విగ్రహాలను, పాత్రలు, వస్తువులు తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నామని యంత్రాలు లేక వీటిని చేయలేకపోతున్నామని అధికారికి వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరినా ఇంతవరకు స్పందన కనిపించలేదు.

వెంటనే మంజూరు చేయండి: మల్లేశం, కోట్‌పల్లి

మాది కోట్‌పల్లి మండల కేంద్రం. 10 సంవత్సరాల నుంచి మట్టితో కుండలను, పాత్రలను చేస్తున్నాం. బీసీ అధికారులు ఇప్పించిన శిక్షణను తీసుకున్నాను. తర్వాత యంత్రాలను ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటికి ఇప్పించలేదు. వెంటనే మంజూరు చేయించి ఆదుకోవాలి. తద్వారా ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది.

జాప్యం చేస్తున్నారు తప్ప ఇవ్వడంలేదు : శ్రీశైలం, బొంరాస్‌పేట

యంత్రాలు పంపిణీ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉండేది. మూడు సంవత్సరాల నుంచి యంత్రాల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులను తరచుగా కలుస్తున్నాం. వారు మాత్రం ఇప్పిస్తాం అంటూ జాప్యం చేస్తున్నారు.. తప్ప స్పందించడంలేదు. దీనివల్ల ఆర్థికంగానూ అవస్థలు పడాల్సి వస్తోంది. వెంటనే యంత్రాలను పంపిణీ చేయాలి. ఆర్థికంగా ఆదుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని