logo
Published : 05 Jul 2022 01:53 IST

బిందు పరికరం... ఇస్తే ప్రయోజనం

హామీ నెరవేర్చాలంటున్న రైతులు

న్యూస్‌టుడే, పరిగి పరిగి గ్రామీణ

కొత్తిమీర కోస్తున్న కూలీలు

రైతులకు సాగు సులభంగా ఉండేందుకు ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సకాలంలో ఇస్తామన్న హామీని సైతం అధికారులు నెరవేర్చకపోతే అవస్థలు తప్పవు. ప్రస్తుతం కొత్తిమీర సాగు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.

ఒకప్పుడు నామమాత్రం సాగుచేసిన రైతులు ఆశించిన దానికంటే లాభాలు బాగుండటంతో ఇప్పుడు ముఖ్యమైన పంటగా మారుతోంది. రానురాను సాగు విస్తీర్ణం పెరగడంతో రాష్ట్ర స్థాయిలో పరిగి మండలం నస్కల్‌ గ్రామం ద్వితీయ స్థానానికి చేరి ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇదే సమయంలో పంటను తక్కువ ఖర్చుతో పండించేందుకు ఉపయోగపడే బిందు పరికరాలను అందించేందుకు గతంలో అధికారులు ఇచ్చిన హామీని అమలుచేయాలని రైతులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ఖర్చు చారెడు: పరిగి ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి నేలలు ఉండటంతో కొత్తిమీర సాగుకు అనుకూలంగా మారాయి. నస్కల్‌ గ్రామంలో 2849 ఎకరాలు సాగు భూమి ఉండగా 962 మంది రైతులున్నారు. ఊరంతా కలిపి ప్రతి సీజన్‌లో 200 ఎకరాలు సాగు చేస్తున్న వీరు ప్రస్తుతం 119 ఎకరాల్లో పండిస్తున్నారు.

ఎకరా విస్తీర్ణంలో పంటను సాగు చేసేందుకు సుమారు 60 -65కిలోల విత్తనం అవసరం ఉంటోంది. విపణిలో కిలో విత్తనం రూ.130 వరకు కొనుగోలు చేస్తున్నారు. అవసరాన్ని బస్తా డీఏపీ ఎరువును వాడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో పంట వస్తోంది. ఒక్కో రైతు గత సీజన్‌లో ఎకరాకు రూ.60 రూ.70వేల వరకు ఆదాయం పొందారు.

కొనాల్సి వస్తోంది ...

బిందు పరికరాలు అందకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రెయిన్‌ డ్రిప్‌ సాయంతో పంటను సాగు చేస్తున్నారు. విపణిలో రూ.13వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇది తలకుమించిన భారంగా మారినా విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు పెట్టాల్సి వస్తోంది. ఉద్యానశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి గతేడాది ఫిబ్రవరి 2న ఈ గ్రామాన్ని సందర్శించి సాగు పట్ల రైతులను అభినందించారు. కొత్తిమీరను సాగు చేస్తున్న రైతులందరికీ బిందు పరికరాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడిచినా అడుగు ముందుకు పడలేదు. రెయిన్‌ డ్రిప్‌ పరికరాలను రాయితీపై అందిస్తే తమకు కష్టాలు తీరడంతో పాటు పంట నాణ్యతగా వచ్చే అవకాశముందని నీటిని పొదుపు చేసుకునేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని గ్రామస్థులు తెలిపారు.

వెసులుబాటు కలుగుతుంది - నవీన్‌, యువ రైతు

కొత్తిమీరకు ప్రధానంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు డిమాండ్‌ ఉంటోంది. ఈమధ్య కాలంలోనే మూడు పంటలు సాగు చేస్తున్నాం. సాగు విస్తీర్ణం పెంచేందుకు మరింత కృషి చేస్తున్నాం. రెయిన్‌ డ్రిప్‌ మంజూరు చేస్తే మరింత వెసులుబాటు కలుగుతుంది.

ఇవ్వడమే ఆలస్యం - ఎం.రాజేందర్‌, మండల రైతుబంధు అధ్యక్షుడు

గ్రామంలో కొత్తిమీర సాగు పట్ల ఆసక్తి పెరుగుతోంది. 300 మంది రైతులు రెయిన్‌ డ్రిప్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఏడాది కాలంగా రైతులు పరికరాల కోసం నిరీక్షిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని