logo

Hyderabad : చెరువు తవ్వగలవా ఓ జలమండలి?

‘చందానగర్‌ సమీపంలోని లింగంకుంట చెరువు బఫర్‌ జోన్‌లో మురుగు నీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) నిర్మించడం సబబు కాదు. దీనివల్ల చెరువు ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఎస్టీపీ వల్ల దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.

Updated : 06 Jul 2022 07:27 IST

ముంచుకొస్తున్న ఎన్జీటీ గడువు

ఈనాడు, హైదరాబాద్‌


లింగంకుంట వద్ద జలమండలి నిర్మించిన ఎస్టీపీ

‘చందానగర్‌ సమీపంలోని లింగంకుంట చెరువు బఫర్‌ జోన్‌లో మురుగు నీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) నిర్మించడం సబబు కాదు. దీనివల్ల చెరువు ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఎస్టీపీ వల్ల దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలి. ఆ చెరువు విస్తీర్ణానికి రెండింతల భూమిలో హైదరాబాద్‌ చుట్టు పక్కల కొత్త జలాశయం తవ్వించాలి. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీలోపు జలమండలి తుది నివేదిక సమర్పించాలి.’

- జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఇచ్చిన ఈ తీర్పు జలమండలికి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది.

ఏడెకరాల పైనే అవసరం

లింగంకుంట విస్తీర్ణం సుమారు 3.5 ఎకరాలు. రెండింతలంటే దాదాపు ఏడు ఎకరాల్లో కొత్త చెరువును నిర్మించాలి. హైదరాబాద్‌ చుట్టుపక్కల అంటే ప్రభుత్వ భూమే దిక్కు. ప్రైవేటు భూమి సేకరించాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. అంత మొత్తం బోర్డు నుంచి పెట్టే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని జలమండలి.. నీటి పారుదల శాఖ, హెచ్‌ఎండీఏ, పీసీబీ తదితర ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లింది. భూ సేకరణ నుంచి చెరువు తవ్వకం రెవెన్యూ, నీటి పారుదల శాఖ పరిధిలో ఉంటాయి. జలమండలి కేవలం తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ లాంటి పనులు మాత్రమే చూస్తోంది. చెరువు తవ్వాలన్నా.. పెద్ద తతంగమే. తొలుత ప్రభుత్వం భూమి కేటాయించాలి. ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే.. ప్రైవేటు నుంచి సేకరించాలి. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎకరా రూ.కోట్లలోనే ఉంది. హెచ్‌ఎండీఏకు చెందిన ఏడు జిల్లాల పరిధిలో ఎక్కడైనా చెరువు తవ్వించాలని జలమండలి కోరినట్లు సమాచారం. మొత్తం అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని దీనిపై ఎన్జీటీకి తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం తెరపైకి వచ్చి పదేళ్లు గడుస్తున్న దృష్ట్యా ఎన్జీటీ స్పందన ఎలా ఉంటుందోనని అధికారులు కిందామీద పడుతున్నారు. తొలుత భూమిని గుర్తించి ఆ విషయాన్ని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గోదావరి బేసిన్‌లో భూమి కోసం వెతుకుతున్నట్లు జలమండలి అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. త్వరలో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందన్నారు. కాగా.. ఎన్జీటీ సూచన అందరికీ కనువిప్పు కావాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఇకనైనా చెరువుల్లో ఇళ్లు నిర్మించడం, ప్లాట్లు వేసి విక్రయించడం లాంటి చర్యలకు అడ్టుకట్ట వేయాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని