logo

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

తల్లి పొత్తిళ్లలో సేదదీరాల్సిన చిన్నారి నీటి సంపులో శవమై తేలింది. తొలి సంతానం రెండేళ్ల కిందట మృతి చెందగా.. రెండో సంతానమైన 51 రోజుల చిన్నారి కూడా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జగద్గిరిగుట్ట పోలీసులు, చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 06 Jul 2022 02:11 IST

సంపులో శవమై తేలిన వైనం

 

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: తల్లి పొత్తిళ్లలో సేదదీరాల్సిన చిన్నారి నీటి సంపులో శవమై తేలింది. తొలి సంతానం రెండేళ్ల కిందట మృతి చెందగా.. రెండో సంతానమైన 51 రోజుల చిన్నారి కూడా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జగద్గిరిగుట్ట పోలీసులు, చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన సరస్వతి కుటుంబం కొన్నేళ్ల కిందట షాపూర్‌నగర్‌కు వలసొచ్చి లెనిన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆమె కుమార్తె జ్యోతి(30)కి పటాన్‌చెరువు పరిధి ఇస్నాపూర్‌వాసి రాజేష్‌(32)తో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. రాజేష్‌ పెయింటర్‌గా పనిచేస్తుండగా జ్యోతి ఇంట్లోనే ఉంటోంది. వీరికి ఏడేళ్ల కిందట ఓ కుమారుడు పుట్టి రెండేళ్ల కిందట ఐదేళ్ల వయసులో అనారోగ్యంతో మృతిచెందాడు. రెండో సంతానంగా ఈ ఏడాది మే 14న పాప పుట్టింది. చిన్నారి పుట్టినప్పటి నుంచి రోజూ రాత్రిపూట విపరీతంగా ఏడ్చేదని, దాంతో తల్లిదండ్రులు నిద్రకు ఇబ్బందిపడేవారని తెలుస్తోంది. సోమవారం రాత్రి కూడా బాలిక ఏడవటంతో తండ్రి ఉదయం 3 గంటల వరకు పాపను ఎత్తుకున్నాడు. తర్వాత భార్యకు అప్పగించి పడుకోగా జ్యోతి కూడా పాపను నిద్రపుచ్చి పడుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు లేచి చూడగా పాప కనిపించలేదు. ఉదయం 6 గంటలకు కాళ్లు కడుక్కొనేందుకు రాజేష్‌ సంపు మూత తీయగా నీటిలో పాప శవం కనిపించింది. జ్యోతి తండ్రిని గతంలో హత్య చేసిన బంధువులపై చిన్నారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. జ్యోతి, రాజేష్‌ తీరునే పోలీసులు సందేహిస్తున్నారు. బాలానగర్‌ ఏసీపీ గంగారాం, సీఐ సైదులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని