logo

రాష్ట్రంలో 18.. దేశంలో 101 కేసులు!

బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి.. దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను దోచేస్తున్న 11 మంది అంతర్రాష్ట్ర సైబర్‌ దొంగలను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.

Published : 06 Jul 2022 02:11 IST

11 మంది అంతర్రాష్ట్ర సైబర్‌ నేరస్థుల అరెస్టు


నోయిడాలో కాల్‌ సెంటర్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి.. దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను దోచేస్తున్న 11 మంది అంతర్రాష్ట్ర సైబర్‌ దొంగలను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. మంగళవారం సీసీఎస్‌ సమావేశ మందిరంలో అదనపు డీసీపీ స్నేహా మెహ్రా, సైబర్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌లతో కలిసి సీసీఎస్‌(డీడీ) జాయింట్‌ కమిషనర్‌ గజరావుభూపాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కంచన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళకు మే 11న ఇలాగే ఫోన్‌చేసి ఓటీపీలతో రెండు దఫాలుగా రూ.లక్ష దండుకున్నాడు. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లభించిన ఆధారాలతో సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ భద్రరరాజు రమేష్‌, ఎస్సై నరేష్‌, పీసీలు మహేశ్వర్‌రెడ్డి, ఫెరోజ్‌, జి.మహేష్‌, ఎం.మహేష్‌, గజేశ్వర్‌ బృందం నోయిడాకు వెళ్లి ముఠా స్థావరంపై దాడి చేసింది.

ఇంటిని అద్దెకు తీసుకొని.. నోయిడాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని డెస్క్‌లు, కంప్యూటర్లతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తరహాలో ముస్తాబు చేశారు. అందులో మోసాలకు పాల్పడుతున్నవారిలో యువకులతో పాటు యువతులూ ఉన్నారు. నోయిడా, దిల్లీవాసులు నీరజ్‌కుమార్‌, ముఖేష్‌కుమార్‌, రోహిత్‌కుమార్‌, ఆకాష్‌కుమార్‌, అజయ్‌సింగ్‌, సచన్‌ వైష్ణవ్‌, ప్రియాంక శర్మ, ప్రగ్యా టండన్‌, హిమాన్షు కటేరి, రాధిక ధమ్జా, ప్రీతికుమార్‌ సిన్హాలను సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలకు 41(ఏ) నోటీసులిచ్చారు. పురుషులను మాత్రమే నగరానికి తీసుకొచ్చారు. వీరు తెలంగాణలో 18, దేశవ్యాప్తంగా 101 ఇలాంటి తరహా నేరాలు చేశారని జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు. కేసును పరిష్కరించిన ఏసీపీ ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ బృందాన్ని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని