logo

hyderabad : మన బ్యాంకే కదా.. వాడేసుకుందాం

బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగమంటే బ్యాంకంతా మనదే.. మనమే రుణాలు తీసుకుందాం.. షేర్లు కొందాం.. అమ్మేద్దాం.. లాభాలొస్తే జమచేద్దాం.. నష్టాలొస్తే కిస్తీలు కట్టకుండా వదిలేద్దామని హైదరాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మేనేజర్‌ భావించాడు.

Updated : 06 Jul 2022 10:24 IST

ఖాతాదారుల పేర్లతో బంగారంపైరుణం తీసుకున్న మేనేజర్‌

రూ.1.62 కోట్లు కుటుంబీకులకు.. అటు నుంచి షేర్ల క్రయవిక్రయాలకు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగమంటే బ్యాంకంతా మనదే.. మనమే రుణాలు తీసుకుందాం.. షేర్లు కొందాం.. అమ్మేద్దాం.. లాభాలొస్తే జమచేద్దాం.. నష్టాలొస్తే కిస్తీలు కట్టకుండా వదిలేద్దామని హైదరాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మేనేజర్‌ భావించాడు. అనుకున్నదే తడవుగా బంగారురుణాలపై దృష్టి సారించాడు. సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల వివరాలు సేకరించాడు. అందులో తొమ్మిది మంది పేర్లతో బంగారు రుణాలు తీసుకుని కుటుంబీకుల ఖాతాల్లోకి జమచేశాడు. అటునుంచి తన డీమ్యాట్‌ ఖాతాలోకి జమచేసుకుని షేర్ల క్రయవిక్రయాలు సాగిస్తున్నాడు. ఆర్థిక సంవత్సరం చివర్లో లెక్కలు తీయగా రూ.1.62 కోట్ల అక్రమాలు బయటపడ్డాయి. ఉన్నతాధికారులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు బ్యాంకు మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. ఆయన డీమ్యాట్‌ ఖాతాలను పరిశీలించి, వాటిల్లోని రూ.1.58 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేశారు.

రూ.35 లక్షల విచక్షణాధికారంతో..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోయిన్‌పల్లి శాఖలో సంతోష్‌ కుమార్‌ స్కేల్‌-2 మేనేజర్‌గా గతేడాది అక్టోబరు నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. బంగారంపై గరిష్టంగా రూ.35లక్షల రుణం ఇచ్చే అధికారం ఆయనకు ఉండడంతో, దాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ బ్యాంకులోని తొమ్మిది పొదుపు ఖాతాల నుంచి రూ.1.62 కోట్లు రుణం తీసుకున్నాడు. రుణం మంజూరుపై సంతకం సంతోష్‌ది ఉండడంతో బంగారం ఉందా? లేదా? అని ఉన్నతాధికారులు గమనించలేదు. తాను సంతకం చేసిన పత్రాలను ధ్రువీకరించేందుకు మరో అధికారికి చెందిన ఐడీలను వినియోగించుకున్నాడు. కిస్తీలు నాలుగైదు నెలల తర్వాత కడతారంటూ పొదుపు ఖాతాలు తీసుకున్న వారి తరఫున సంతోష్‌ చెప్పడంతో బ్యాంకు అధికారులకు అనుమానం రాలేదు..

మార్చిలో తనిఖీలతో వెలుగులోకి

మార్చినెల తనిఖీల్లో భాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నతాధికారులు, ఆడిట్‌ అధికారులు బోయిన్‌పల్లి శాఖకు వెళ్లారు. రుణాల లెక్కాపత్రాలను పరిశీలించారు. మూడు కిలోలకుపైగా బంగారు నగలు కనిపించకపోవడాన్ని గుర్తించారు. వాటిపై రుణాలు తీసుకున్నట్టు రసీదులు, పత్రాలు మాత్రం ఉన్నాయి. పసిడిపై రుణాలిచ్చే బాధ్యత సంతోష్‌ కుమార్‌దేనని చీఫ్‌ మేనేజర్‌ చెప్పారు. సంతోష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం చీఫ్‌ మేనేజర్‌ ఎంసీ నాగరాజు సీసీఎస్‌లో ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు బృందం సంతోష్‌ను అరెస్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని