logo
Updated : 06 Jul 2022 07:16 IST

hyderabad: రైలు బండి.. అడ్డురాదండి

నగరంలో 42 చోట్ల ఆర్యూబీ, ఆర్వోబీలకు ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌


కారిడార్‌ 2లో ఆర్వోబీ, ఆర్యూబీ ప్రతిపాదిత ప్రాంతాలు(ఎరుపు వర్ణంలో)

భాగ్యనగరంలో రైల్వేలైన్లు ఆరు దిశల్లో విస్తరించాయి. వాటికి ఇరువైపులా లక్షలాది మంది నివసిస్తున్నారు. రైలు బండి వచ్చిందంటే.. వాహనదారులు గేటు వద్ద ఎక్కువ సేపు ఆగాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో పట్టాలు దాటుతూ.. చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్ల పొడవునా ఎక్కడెక్కడ వంతెనలు నిర్మించవచ్చనే అంశంపై అధ్యయనం చేపట్టింది. నగర ప్రణాళిక విభాగం సర్వే చేసింది. ప్రాథమికంగా 42 ప్రాంతాలను గుర్తించింది. ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి), ఆర్వోబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) లేదా లెవల్‌ క్రాసింగ్‌లు, కొన్నిచోట్ల ప్రస్తుత అదనపు మార్గం(వెంట్‌) నిర్మించాలనే ప్రతిపాదనలు చేసింది. మొత్తం నగరంలోని రైలు మార్గాలను ఆరు కారిడార్లుగా విభజించి.. వాటి పొడవునా ఆర్‌యూబీ, ఆర్వోబీ, లెవల్‌ క్రాసింగ్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆయా ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సాధ్యాసాధ్యాల లెక్క తేల్చేందుకు తాజాగా ప్రాజెక్టుల విభాగం రంగంలోకి దిగింది. ఇంజినీర్లు స్థానికులతో మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడ పనులు చేపట్టాలనే అంశంపై స్పష్టత వస్తుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

అభ్యంతరాలూ ఉన్నాయి..: కొన్నిచోట్ల పౌరులు ఆర్‌యూబీ, ఆర్వోబీల నిర్మాణానికి సుముఖంగా లేరు. వారి ఇళ్లను తొలగించాల్సి వస్తుందని అభ్యంతరం తెలుపుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో అదనపు వెంట్‌లను నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇంజినీర్లు తెలిపారు.

కారిడార్ల వారీగా ప్రతిపాదిత ప్రాంతాలు ఇలా..

* కారిడార్‌-1లో.. చిలకలగూడ, మాణికేశ్వర్‌నగర్‌, విద్యానగర్‌, తిలక్‌నగర్‌, నింబోలిఅడ్డ, కాచిగూడ, యాకుత్‌పుర, భవానినగర్‌, లలిత్‌బాగ్‌, జీఎం చౌని, శివరాంపల్లి, గగన్‌పహాడ్‌

* కారిడార్‌-2లో నాంపల్లి రైల్వేస్టేషన్‌, డీజీపీ ఆఫీసు, ఖైరతాబాద్‌ రైల్వేగేటు, ఖైరతాబాద్‌ ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఎస్‌ మక్తా రాజ్‌భవన్‌రోడ్డు, పార్కు హోటల్‌ రోడ్డు, కుందన్‌బాగ్‌, నేచర్‌క్యూర్‌ పార్కు, పాటిగడ్ఢ

* కారిడార్‌-3లో చందానగర్‌, హఫీజ్‌పేట రైల్వేట్రాక్‌, సైబర్‌వ్యాలీ, వసంతసిటీ (హఫీజ్‌పేట), గాయత్రినగర్‌ నుంచి కాముని చెరువు వద్ద, యూసఫ్‌నగర్‌ నుంచి గాయత్రినగర్‌ వయా యూనియన్‌బ్యాంకు రోడ్డు, సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడ.

* కారిడార్‌-4లో బాబానగర్‌, ఉప్పరగూడ(లెవల్‌ క్రాసింగ్‌), ఎన్‌ఎఫ్‌సీ మల్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు, భరత్‌నగర్‌ చర్లపల్లి

* కారిడార్‌-5లో.. గౌతమ్‌నగర్‌, సఫిల్‌గూడ(లెవల్‌ క్రాసింగ్‌), బొల్లారం, తుర్కపల్లి

* కారిడార్‌-6లో.. బీహెచ్‌ఈఎల్‌, కిష్టమ్మ ఎన్‌క్లేవ్‌, వెస్ట్‌ వెంకటాపురం, వాజ్‌పేయీనగర్‌, కాకతీయనగర్‌, వినయ్‌నగర్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని