logo
Updated : 06 Jul 2022 07:59 IST

Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్‌ ముప్పు!

ఎంఎన్‌జేకు వచ్చే రోగుల్లో నిత్యం ఒకరిద్దరిలో గుర్తింపు

ముందే మేల్కొంటే.. నియంత్రణకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌

ప్రొస్టేట్‌ (వీర్య గ్రంథి) క్యాన్సర్‌ ముప్పు పెరుగుతోంది. నాంపల్లి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి రోజూ వచ్చే రోగుల్లో ఒకరిద్దరిలో వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా 50 ఏళ్లు వయసు దాటిన వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు కన్పించినా.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి ప్రాణాలకే ప్రమాదం కానుందని హెచ్చరిస్తున్నారు. గతంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ మంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితులు కనిపించేవారు. జీవన ప్రమాణాలు పెరగడంతో మన వద్ద కూడా సగటు వయసు 69-70 సంవత్సరాలు దాటుతోంది. వయసుతోపాటు వివిధ వ్యాధుల మాదిరిగానే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పొంచి ఉంటోంది. గతంతో పోలిస్తే వైద్య సదుపాయాలు పెరగడం, ఆరోగ్యంపై అవగాహన రావడంతో చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కేసులు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఎంఎన్‌జేకు నిత్యం 500-600 మంది వరకు అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. ఎక్కువగా రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార, నోటి, తల, మెడ క్యాన్సర్లతోపాటు పెద్దవారిలో 10-15 మందిలో ప్రొస్టేట్‌ కేన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకరిద్దరిలో వ్యాధి నిర్ధారణ అవుతోందని వైద్యులు తెలిపారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రావటానికి ప్రత్యేక కారణాలంటూ లేవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకు ముందు రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఈ క్యాన్సర్‌ ఉంటే, వారి సంతానం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఊబకాయుల్లో ఇతర క్యాన్సర్లు మాదిరిగానే ఇదీ వచ్చేందుకు అవకాశముందని వివరిస్తున్నారు.

ఇవీ లక్షణాలు

* మూత్ర విసర్జనలో ఇబ్బంది

* మూత్ర ప్రవాహ వేగంలో సమస్యలు

* మూత్రం, వీర్యంలో రక్త చారికలు కన్పించడం

* రాత్రి వేళ ఎక్కువసార్లు మూత్రం రావడం

* అంగ స్తంభనలో ఇబ్బందులు

* మెడ భాగం నుంచి కింద వరకు నొప్పి

* ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం


భయం అవసరం లేదు.. అప్రమత్తత ముఖ్యం

-డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై భయపడాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లు దాటిన పురుషులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కన్పిస్తే నేరుగా నిపుణులను సంప్రదించడం మేలు. నిర్లక్ష్యం వద్ధు చక్కటి జీవన శైలితో 30 శాతం క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్ఛు అందులో ప్రొస్టేట్‌ కేన్సర్‌ కూడా ఒకటి. సీజన్‌లో లభించే అన్ని రకాల పండ్లతో పాటు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. తృణ ధాన్యాలు కూడా ఆహారంలో చేర్చాలి. ఆరోగ్యకరంగా ఉండేందుకు పౌష్టిక, సమతుల ఆహారం దోహదం చేస్తుంది. మద్యపానం, ధూమ పానానికి దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో ఖనిజాలు, విటమిన్లు తదితర సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సరైన ఆహారంతో పాటు రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. చెమట పట్టేలా ఏదైనా వ్యాయామం చేయవచ్ఛు దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్ఛు ఎంఎన్‌జే ఆసుపత్రిలో ఈ చికిత్సకు వైద్య నిపుణులతో పాటు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధిని రక్త పరీక్ష ద్వారా నిర్ధారించవచ్ఛు ఎవరైనా వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్ఛు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts