logo

Fire accident : నిప్పుపై నీరెట్లా?

రాజధానిలో భవన నిర్మాణ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఆకాశమే హద్దుగా అంతస్తుల మీద అంతస్తులను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ మహాగనగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తాజాగా 52 అంతస్తుల ఎత్తులో అపార్టుమెంట్‌ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబోతోంది.

Updated : 06 Jul 2022 08:24 IST

52 అంతస్తులఅపార్టుమెంట్‌ అనుమతికిబల్దియా యోచన

18 ఫ్లోర్లు మించితే ప్రమాదాలు నిరోధించలేని స్థితిలో అగ్నిమాపకశాఖ

రాధానిలో భవన నిర్మాణ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఆకాశమే హద్దుగా అంతస్తుల మీద అంతస్తులను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ మహాగనగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తాజాగా 52 అంతస్తుల ఎత్తులో అపార్టుమెంట్‌ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబోతోంది. ఇదేసమయంలో పెరుగుతున్న భవనాల్లో ఎప్పుడైనా అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఆర్పే యంత్రాంగం అగ్నిమాపక శాఖ దగ్గర ఉందా అంటే లేదనే చెప్పాలి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18 అంతస్తుల ఎత్తులో నిర్మించే అపార్టుమెంట్లలో ప్రమాదం జరిగితే నిరోధించే వ్యవస్థ మాత్రమే సంబంధిత శాఖ దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక వ్యవస్థను పటిష్ఠం చేయకుండా సరికొత్త యంత్రాలు కొనుగోలు చేయకుండా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

రెండు వాహనాలే..

రియల్టర్లు గతంలో ఎక్కువ భూ విస్తీర్ణంలో పది నుంచి 20 అంతస్తుల ఎత్తులో అపార్టుమెంట్లు నిర్మించేవారు. రాజధాని పరిధిలో స్థలం లభించడం గగనంగా మారడంతో బహుళ అంతస్తుల భవనాల మీద నిర్మాణదారులు దృష్టిసారించారు. మొన్నటి వరకు జీహెచ్‌ఎంసీ బంజారాహిల్స్‌తోపాటు నార్సింగి ప్రాంతంలో 45 అంతస్తుల అపార్టుమెంటు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద 42 ఫ్లోర్లకు సమ్మతించారు. సరికొత్తగా 52 అంతస్తుల భవనం ఓ నిర్మాణం సంస్థ దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి ఇచ్చేందుకు నగర ప్రణాళికా అధికారులు పరిశీలన చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ సైతం 52 అంతస్తుల భవనానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధమైంది. మహానగరం పరిధిలో 25 అగ్నిమాపక కేంద్రాలు ఉంటే వాహనాలు 55 మాత్రమే ఉన్నాయి. మహానగరంలో 20 లక్షల నిర్మాణాలున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ దగ్గర 52 మీటర్లు అంటే 18 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగితే నిరోధించే బ్రాంటో స్కైలిప్టు వాహనాలున్నాయి. ఇవి కూడా రెండే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మహానగరంలో 40 అంతస్తుల అపార్టుమెంట్‌/ భవనంలో అగ్నిప్రమాదం జరిగితే దాన్ని ఎలా నిరోధించాలన్న దానిపై సంబంధిత శాఖ దగ్గర సమాధానం కూడా లేదు. నిర్మాణ అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉన్న సర్కార్‌ ఇదే సమయంలో సంబంధిత భవనాల్లో ప్రమాదాలను నిరోధించే వ్యవస్థలను ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బహుళ అంతస్తులను నిర్మిస్తున్న సంస్థలు కూడా ఇటువంటి యంత్రాలను సమకూర్చుకోవడం లేదు. సరికొత్త యంత్రాలను సమకూర్చుకోవడంపై తగిన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. సర్కార్‌ నుంచి అనుమతి రాగానే సమకూర్చుకుంటామని చెప్పారు.

- ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని