logo
Updated : 06 Jul 2022 13:18 IST

అఘోరా వేషం.. దోషమంటూ మోసం

రూ.37.71 లక్షలకు టోకరా

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు


 అర్జున్‌నాథ్‌              పునరామ్‌            వస్నారామ్‌           ప్రకాష్‌ జోతా

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, నాగోలు: జనం బలహీనతలు, నమ్మకాలే అవకాశంగా పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ బాబాల ఆగడాలకు భువనగిరి ఎస్‌వోటీ, పట్టణ పోలీసులు కళ్లెం వేశారు. 11మంది సభ్యుల ముఠాలో ఏడుగురిని అరెస్టు చేశారు. మంగళవారం ఎల్బీనగర్‌ రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో భువనగిరి, ఎస్‌వోటీ డీసీపీలు నారాయణరెడ్డి, మురళీధర్‌ ఏసీపీ వెంకన్ననాయక్‌లతో కలసి సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.


జొన్నాథ్‌                          రామ్‌నాథ్‌                       గోవింద్‌నాథ్‌

చేతి గాయాలు చూసి..

యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురం నివాసి కొండల్‌రెడ్డి(53). వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. 2020 నవంబరు 29న పొలం పనులు పూర్తి చేసుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. దారిలో అకస్మాత్తుగా వాహనానికి ఎదురుగా తాచుపాము రావడంతో పట్టుతప్పి కిందపడ్డారు. చేతులకు గాయాలయ్యాయి. వైద్యచికిత్స అనంతరం యథావిధిగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. అదే ఏడాది డిసెంబరు 12న ఆయన ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో ఉండగా భిక్షాటన చేసుకుంటూ ఇద్దరు సాధువులు అక్కడికి చేరారు. రాజస్థాన్‌ షిరోహి జిల్లాకు చెందిన సంజునాథ్‌, ఘోరక్‌నాథ్‌గా పరిచయం చేసుకున్నారు. ఆయన చేతి గాయాలను పసిగట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతడినుంచి పెద్దమొత్తంలో డబ్బు కొట్టేసేందుకు డ్రామా ప్రారంభించారు. తాము అతీంద్రియ శక్తులున్న సాధువులు, అఘోరాలమని చెప్పారు. సర్పదోషం కారణంగానే ప్రమాదం జరిగిందని, దోష నివారణకు పూజలు చేయాలని, కాలయాపన చేస్తే నష్టం జరుగుతుందని, కుటుంబ సభ్యులు మరణిస్తారని భయపెట్టారు. నమ్మిన వ్యాపారి సర్పదోష పూజ జరిపించేందుకు అంగీకరించాడు. నకిలీ బాబాలు తొలుత పూజా సామగ్రి కోసం రూ.41,000 వసూలుచేశారు. ఒకరోజు రాత్రి వ్యాపారి ఇంట్లో పూజ జరిపించి వెళ్లిపోయారు.


నకిలీ బాబాల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సామగ్రిని పరిశీలిస్తున్న
మహేష్‌ భగవత్‌, భువనగిరి యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి

నాగ ప్రతిమ తీసుకొస్తామని..

పూజయ్యాక నెలకు ఘోరక్‌నాథ్‌, సంజునాథ్‌ మరోసారి కొండల్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. సర్పదోషం తొలగిపోలేదని భయపెట్టారు. హిమాలయాల్లో సాధువుల నుంచి నాగప్రతిమ తీసుకొస్తామని ఒకసారి, రూ.10లక్షలు ఇస్తే నాగసాధువులు వచ్చి పూజ చేస్తారని ఒకసారి చెప్పి డబ్బు లాగారు. ఇలా భయపెడుతూ దఫాల వారీగా ఏజెంట్లద్వారా రూ.37.71లక్షలు కాజేశారు. ఆందోళనకు గురైన వ్యాపారి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భువనగిరి ఎస్‌వోటీ, పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నెల 4న బురిడీ బాబాల ఏజెంట్లు, రాజస్థాన్‌ షిరోహి జిల్లాకు చెందిన రామ్‌నాథ్‌(40), జొన్నాథ్‌(33), గోవింద్‌నాథ్‌(28), అర్జున్‌నాథ్‌(22), పునరామ్‌(37), వస్నరామ్‌(22), ప్రకాష్‌ జోతా(27)లు డబ్బు తీసుకునేందుకు ఘట్‌కేసర్‌ వద్దకు రాగానే అరెస్టు చేశారు. రూ.8.30లక్షల నగదు, 12సెల్‌ఫోన్లు, రుద్రాక్షమాలలు, ఎముకల దండలు, కమండలం, నగదు లెక్కించే యంత్రం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు సంజునాథ్‌, ఘోరక్‌నాథ్‌, ప్రకాష్‌ ప్రజాపతి అలియాస్‌ మామాజీ, రమేష్‌ ప్రజాపతిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. నకిలీ బాబాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని సీపీ తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన భువనగిరి ఎస్‌వోటీ, పట్టణ ఏసీపీలు ఎన్‌.వెంకన్ననాయక్‌, ఎస్‌.వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ఏ.రాములు, బి.సత్యనారాయణలను సీపీ అభినందించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని