logo
Updated : 07 Jul 2022 04:52 IST

జేబుకు చిల్లు.. పేదోడు ఘొల్లు

ఉచిత మందులు దొరక్క.. ‘ప్రైవేటు’ను ఆశ్రయించాల్సిన పరిస్థితి

ఉస్మానియా, గాంధీల్లో రోగులపై అధిక భారం

ఈనాడు, హైదరాబాద్‌

యువకుడి పేరు మహమ్మద్‌ జురైద్‌. ముషీరాబాద్‌ వాసి. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గాంధీ ఆసుపత్రికి రాగా, పరీక్షలు చేసి కట్టుకట్టారు. మందులు మాత్రం బయటే కొనుక్కోవాలని రాసిచ్చారు. ప్రైవేటు మెడికల్‌ స్టోర్‌లో రూ.1300 ఖర్చు చేసి మందులు కొనుక్కోవాల్సి వచ్చింది.


తని పేరు వెంకటేష్‌. ఊరు నారాయణ్‌ఖేడ్‌. కాలిలో సమస్య తలెత్తడంతో గాంధీ వైద్యులను సంప్రదించాడు. శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రకాల మందులు రాసివ్వగా కౌంటర్‌లో రెండు రకాలే దొరికాయి. మరో రెండు రకాలు అక్కడ లేకపోవడంతో రూ.వేయి వరకు చెల్లించి బయట కొనుగోలు చేసి చేతి చమురు వదిలించుకున్నాడు.
‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి.. వైద్యులు ఎవరూ బయటకు రాయాల్సిన అవసరం లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం’ అని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పూర్తి స్థాయిలో మందులు లభించడంలేదు. కనీసం ఒకట్రెండు రకాల మందులైనా బయట కొనాల్సి వస్తోంది. గాంధీలో ఆర్థోపెడిక్‌ ఔషధాలకు తీవ్ర కొరత నెలకొంది. అయిదు రకాలు రాస్తే.. రెండు, మూడు రకాలే లభిస్తున్నాయి. కొన్ని యాంటిబయోటిక్స్‌ బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. మరికొన్ని రకాల నొప్పి నివారణ, మల్టీ మిటమిన్లు ఇతర మందులకు కొరత తప్పడం లేదు. లేవని కొన్నిసార్లు, స్టాకు అయిపోయ్యాయని మరికొన్నిసార్లు చెబుతున్నారని రోగులు పేర్కొంటున్నారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 80 శాతం మందులను సరఫరా చేస్తుంది. మరో 20 శాతం అత్యవసర పద్ధతిలో బడ్జెట్‌లో ఆయా ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్నాయి. రోగుల డిమాండ్‌ దృష్ట్యా ఇవి సరిపోవడం లేదు.

గాంధీ ఆసుపత్రిలోని  ప్రైవేటు మందుల దుకాణంలో రద్దీ

తమిళనాడు విధానంపై కసరత్తు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు మెడికల్‌ షాపులు పూర్తిగా ఎత్తేసేలా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో తమిళనాడు తరహాలో అన్ని మందులు ఆసుపత్రిలోనే ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. సాధారణ, అత్యవసర మందులు, కీలక సమయాల్లో ఇచ్చే ఔషదాలు జాబితా వారీగా గుర్తించి అవసరం మేరకు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.


గాంధీలో 3 ప్రైవేటు మెడికల్‌ షాపులు ఉన్నాయి. నెలకు తక్కువలో తక్కువ రూ.5 కోట్ల వరకు ఔషధాలు విక్రయిస్తున్నారు. ఉస్మానియా, నిలోఫర్‌లో అదే పరిస్థితి.

ప్రస్తుతం ఉస్మానియా, గాంధీలో అత్యవసర మందుల కోసం(20శాతం) ఏటా రూ.35-40 కోట్లు బడ్జెట్‌ వరకు కేటాయిస్తున్నారు. ఇవి సాధారణ రోగుల చికిత్సలకూ సరిపోవడం లేదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని