logo

దారి కాచిన మృత్యువు

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాశారు. వర్షం పడుతోందని రోడ్డు పక్కన నిలబడడమే ఒకరి పాలిట శాపం కాగా మరో ఘటనలో అప్పటి వరకు తమతో కలిసి వచ్చిన

Published : 07 Jul 2022 02:11 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల దుర్మరణం

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాశారు. వర్షం పడుతోందని రోడ్డు పక్కన నిలబడడమే ఒకరి పాలిట శాపం కాగా మరో ఘటనలో అప్పటి వరకు తమతో కలిసి వచ్చిన స్నేహితుడు ఇంటికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లడం వారికి తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రానికి చెందిన టి.వినోద్‌(25) కొంత కాలం క్రితం కూకట్‌పల్లి ప్రాంతానికి వచ్చాడు. వసంత్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటూ మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జూనియర్‌ సేల్స్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 ప్రాంతంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో వర్షం అధికం కావడంతో రహేజామైండ్‌ స్పేస్‌ సమీపంలోని అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద ద్విచక్రవాహనాన్ని ఆపి రోడ్డు పక్కన నిల్చున్నాడు. వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన ట్రాలీ ఆటో వినోద్‌ను ఢీకొట్టి ఒక్కసారిగా బోల్తాపడింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ మల్లేష్‌కు స్వల్పగాయాలు కావడంతో అతన్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్‌ ఎస్సై మాల్యానాయక్‌ తెలిపారు.

మరో ఘటనలో ఎలక్ట్రీషియన్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: పుప్పాలగూడ అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో నివసించే లోకిని రాకేష్‌(20) ఎలక్ట్రీషియన్‌. మంగవారం కొండాపూర్‌లో పని ముగించుకుని ద్విచక్రవాహనంపై రాత్రి 8.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. మణికొండ ఆంధ్రా బ్యాంకు సమీపంలో అతడిని ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతణ్ని స్నేహితుడు తరుణ్‌ ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

ఫోన్‌లో తెలుసుకుని..

రాకేష్‌, అతడిని ఆసుపత్రికి తరలించిన తరుణ్‌ అలకాపూర్‌ టౌన్‌షిప్‌ ప్రాంతంలో నివసిస్తుంటారు. ప్రమాదానికి ముందు రాకేష్‌ తన బైకుపై, తరుణ్‌ మరో ద్విచక్రవాహనంపై మరో స్నేహితుడితో కలిసి మణికొండకు బయలుదేరారు. తరుణ్‌ మణికొండ ప్రాంతంలో నివసించే స్నేహితుడిని ఇంటి వద్ద వదిలేసేందుకు వెళ్లాడు. ఈలోగా ఆంధ్రాబ్యాంకు సమీపంలో రాకేష్‌ ప్రమాదానికి గురయ్యాడు. తరుణ్‌ తన స్నేహితుడిని ఇంటి వద్ద వదిలేశాక రాకేశ్‌కు ఫోన్‌ చేయగా దారిన వెళ్లే వారు ఎత్తి అతడు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. వెంటనే ఆయన చేరుకుని మిత్రుడిని ఆసుపత్రికి తరలించాడు. అయినా తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తరుణ్‌ కన్నీరుమున్నీరయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని