logo

గుదిబండ

గ్యాస్‌ బండ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా మారింది. గత ఏడాది నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ పోవడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడం భారంగా మారింది. ఈ తరుణంలో

Published : 07 Jul 2022 02:11 IST

నగర  వాసులపై రూ.10 కోట్ల అదనపు భారం

ఈనాడు, హైదరాబాద్‌

గ్యాస్‌ బండ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా మారింది. గత ఏడాది నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ పోవడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడం భారంగా మారింది. ఈ తరుణంలో ప్రతినెలా గృహావసర సిలిండర్‌ ధర పెంచుతుండటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారవుతోంది. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు రూ.218 పెరగడం గమనార్హం. చమురు సంస్థలు 14.2 కిలోల సిలిండర్‌పై తాజాగా మరో రూ.50 పెంచడంతో రూ.1055 ఉన్న ధర ప్రస్తుతం రూ.1105కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

సాధారణంగా ప్రతినెల ఒకటో తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.183.50 తగ్గించగా ఇప్పుడు మరో రూ.8.50 తగ్గించిన చమురు సంస్థలు, గృహావసర సిలిండర్‌ ధరలను మాత్రం పెంచాయి. ధర పెరిగినప్పుడల్లా అంతకు వారం రోజుల ముందు బుక్‌ చేసుకున్నవారికి కొత్త ధరలే వర్తింపజేస్తుండడం గమనార్హం. మే నెలలో రూ.50 పెంపుతో ధర రూ.1052 కాగా.. తర్వాత కమీషన్‌ ఛార్జీల కింద మరో రూ.3 పెంచారు. తాజాగా మరో రూ.50 పెంపుతో అది రూ.1105కి చేరుకుంది.

డెలివరీ బాయ్‌కి ఇచ్చేది కలిపితే..
రాయితీ కోత, డెలివరీ బాయ్‌కి ఇచ్చే మొత్తం కలిపితే సిలిండర్‌ ధర మరింత పెరుగుతోంది. సాధారణంగా డెలివరీ బాయ్‌లకు గ్యాస్‌ ఏజెన్సీలే డబ్బు చెల్లించాలి. ఏజెన్సీ తమకు ఏమీ చెల్లించదని చెప్పే డెలివరీ బాయ్‌లు వినియోగదారుల నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇల్లు ఉన్న అంతస్తును బట్టి ఇది పెరుగుతూ పోతుంది. మొదటి అంతస్తుకు రూ.20 నుంచి ప్రారంభమై ఇది రూ.50 వరకు ఉంటుంది. సిలిండర్లపై ప్రభుత్వ రాయితీని దాదాపు ఎత్తేయడంతో వినియోగదారుడికి ఖాతాలో కేవలం రూ.40కి అటుఇటుగా జమవుతోంది.

ప్రతి నెలా 20 లక్షల సిలిండర్లు అందజేత
మహానగరం పరిధిలో మొత్తం 32 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతినెల 20 లక్షల వరకు సిలిండర్లు ఇళ్లకు ఇస్తుంటారు. పెరిగిన ధరతో ప్రతినెలా నగరవాసులపై రూ.10 కోట్ల అధనపు భారం పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని