logo

సైబరాబాద్‌ పోలీసులకు ‘మహా’ షాక్‌

మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఆత్మహత్యకు కారకులయ్యారంటూ సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్‌ అధికారులపై కేసు నమోదైంది. ఆత్మహత్య ఉదంతం రెండేళ్ల కిందట జరిగినా.. తాజాగా పోలీసులపై కేసు నమోదు

Published : 07 Jul 2022 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌:  మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఆత్మహత్యకు కారకులయ్యారంటూ సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్‌ అధికారులపై కేసు నమోదైంది. ఆత్మహత్య ఉదంతం రెండేళ్ల కిందట జరిగినా.. తాజాగా పోలీసులపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. పలు సెక్షన్లతోపాటు వ్యాపారిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే కారణంతో ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసే నమోదు కాగా మహారాష్ట్ర పోలీసు బృందం మంగళవారం ఇక్కడికి వచ్చి ఆరా తీసినట్లు తెలుస్తోంది. సాధారణంగా  ఈ సెక్షన్‌ కింద  అరెస్టు చేసే అవకాశం ఉండటంతో వీరిని అరెస్టు చేస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.

చోరీ సొత్తు స్వాధీనానికి వెళ్లి.. 2019 అక్టోబరులో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌదరిగూడలో ఓ ఇంట్లో చోరీ జరగ్గా.. పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముఠాను పట్టుకున్నారు. దొంగలు ఆ సొత్తును నాసిక్‌లో విక్రయించినట్లు తేలడంతో 15 మందితో కూడిన పోలీసు బృందం 2020 ఫిబ్రవరిలో అక్కడికి వెళ్లింది. అక్కడి ముంబయినాకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విజయ్‌బిరారీ(47) అనే వ్యాపారిని ఫిబ్రవరి 24న అదుపులోకి తీసుకుంది. అక్కడి గడ్కరీచౌక్‌ గెస్ట్‌హౌస్‌లో ఉంచి విచారించింది. అనూహ్యంగా బిరారీ నాలుగో అంతస్తు నుంచి దూకడంతో మరణించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను మహారాష్ట్ర సీఐడీకి అప్పగించారు. రెండేళ్లకుపైగా దర్యాప్తు చేసిన సీఐడీ పోలీసులు తాజాగా నాసిక్‌లోని ముంబయినాకా ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత జూన్‌ 20న ఐపీసీ 306, 166, 166ఎ, 223, 348, 34 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిందితుల్ని పట్టుకొని రావడానికి వెళ్తే అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, సైబరాబాద్‌ పోలీస్‌ బృందం అప్పట్లో ఈ నిబంధనను పాటించకుండా నిందితుడిని అనధికార కస్టడీలో విచారించడం ఎఫ్‌ఐఆర్‌కు కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని