logo

hyderabad : కాపాడుతుందన్నా.. కదలరేమన్నా?

రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతూ, కొవిడ్‌ బారిన పడిన వారు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. గాంధీ ఆస్పత్రిలో 30 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్ర లక్షణాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Updated : 25 Jul 2022 07:47 IST

బూస్టర్‌ డోసు తీసుకుంది 7 శాతం మందే
నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతూ, కొవిడ్‌ బారిన పడిన వారు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. గాంధీ ఆస్పత్రిలో 30 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్ర లక్షణాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండు డోసుల టీకా వేయించుకున్న వారు బూస్టర్‌ డోసు వేయించుకుంటేనే వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఉచితంగా బూస్టర్‌ డోసు వేస్తామన్నా.. ముందుకొస్తున్న వారి సంఖ్య ఇంకా భారీగా పెరగాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.

మొదటి రెండు దశల్లో కరోనా వైరస్‌ ధాటికి గ్రేటర్‌ పరిధిలో లక్షలాది మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందలాది మంది కన్నుమూశారు. అప్పట్లో ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమైంది. కేంద్రం ఆదేశాల మేరకు గ్రేటర్‌లో 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకాలను ఇప్పించడంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ విశేష కృషి చేసింది. మొదటి, రెండు డోసులను వంద శాతం మంది తీసుకున్నారు. 12-17 ఏళ్ల లోపువారికి టీకా వేయడానికి అనుమతి ఇచ్చినా సగటున 50 శాతం మంది ముందుకురాలేదు. తల్లిదండ్రులే చొరవ తీసుకోవడం లేదని వైద్యులు చెబుతున్నారు.

వంద కేంద్రాల ఏర్పాటు

గ్రేటర్‌లో ప్రస్తుతం రోజూ అధికారికంగా 372 మందికి కరోనా సోకుతోంది. రెండు డోసుల టీకా చేయించుకోని వారి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు అంటున్నారు. వేయించుకున్న వారిలోనూ యాంటీబాడీల సంఖ్య తగ్గుతుండటంతో బూస్టర్‌ డోసు అవసరమని కేంద్రం సూచించింది. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా వాక్సిన్‌ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో దాదాపు వంద కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 7-8 శాతం లోపు మూడో డోసు చేయించుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాజేంద్రనగర్‌, వనస్థలిపురం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరిశీలిస్తే రోజుకు 300 మంది రావడంలేదు. ఈ నేపథ్యంలో మూడో డోసు ఆవశ్యకతను చాటేలా పెద్దఎత్తున ప్రచారం చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని