logo

ధరలు తగ్గించేవరకు ఆందోళన

పెంచిన ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆందోళనలు ఆగవని  డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ పిలుపు మేరకు బస్టాండు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Published : 06 Aug 2022 00:45 IST


పరిగి రహదారిపై బైఠాయించిన టీఆర్‌ఆర్‌, నాయకులు

పరిగి,న్యూస్‌టుడే: పెంచిన ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆందోళనలు ఆగవని  డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ పిలుపు మేరకు బస్టాండు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో ఉన్న తెరాస ప్రభుత్వాలు పెంచుతున్న ధరలతో పేదలు అల్లాడిపోతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, చౌడాపూర్‌ మండలాల పార్టీ అధ్యక్షులు పరశురాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణ, రామకృష్ణారెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం టీఆర్‌ఆర్‌ బీసీ, ఖాన్‌ కాలనీ, మందుల కాలనీల్లో పర్యటించారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి పేదల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వికారాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నాయని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్‌ పిలుపు మేరకు వికారాబాద్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బీజేఆర్‌ చౌరస్తా కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రో, గ్యాస్‌ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని, రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేకతతో గద్దె దిగడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌ముదిరాజ్‌ పాల్గొన్నారు.బంట్వారం మండల కేంద్రానికి చెందిన తెరాస ఎంపీటీసీ పద్మతో పాటు పలువురు వ్యాపారులు, భాజపా నాయకులు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.


వికారాబాద్‌లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌

తాండూరు టౌన్‌: తాండూరులో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం ఆందోళన చేశారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో బైఠాయించి ధర్నా చేశారు. తరుచుగా ధరలు పెంచుతు పేదోళ్ల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నా ప్రభుత్వం మాత్రం ధరల మీదనే దృష్టి సారించిందని విమర్శించారు. కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌, పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌, పురపాలక సంఘం కౌన్సిలరు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, నాగరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని