logo
Published : 06 Aug 2022 00:45 IST

అంతర్గత విభేదాలు.. అభివృద్ధికి తిలోదకాలు!

రూ.కోట్లు ఉన్నా ముందుకు సాగని పనులు
న్యూస్‌టుడే, తాండూరు


సాయిపూర్‌లో కాలువ నిర్మాణం లేక..

పురపాలికల్లో సకల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తద్వారా ప్రజల ఇబ్బందులు దూరం చేయాలన్నది ధ్యేయం. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ కారణాలతో అడుగు ముందుకు పడటంలేదు. రూ.కోట్లు అందుబాటులో ఉన్నా, పాట్లు తప్పడంలేదు. ఇదే పరిస్థితి తాండూరు పట్టణంలో నెలకొంది. ఈ వ్యవహారంపై ‘న్యూస్‌టుడే’ కథనం...

తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు, 14వేల గృహాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనాభా 71వేలు. అనధికారికంగా లక్ష వరకు ఉంటుంది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. వీటితో పనులు చేపడితే వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. అయితే పాలక పక్షంలో నెలకొన్న అంతర్గత విభేదాలు కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. ఏడాదిగా రూ.10.5 కోట్లు మూలుగుతున్నాయి. 14వ ఆర్థికసంఘం, 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి పద్దుల కింద మంజూరైనవి, పన్నుల రూపకంలో వచ్చినవి ఇందులో  ఉన్నాయి. పట్టణంలో అంతర్గత రోడ్లు,  కాలువల నిర్మాణం, తాగు నీటి సరఫరాకు పైపుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వినియోగించవచ్చు. అయితే పాలక పక్షం రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

దారులు అస్తవ్యస్తం
చాలా కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేవు. వానలకు మట్టి రోడ్లు బురద మయంగా మారుతున్నాయి.  కొన్ని చోట్ల నడవలేని దుస్థితి. కాలువలు లేని ప్రాంతాల్లో ఎగువ నుంచి వస్తున్న మురుగు ఖాళీ ప్రదేశాల్లో మడుగు కడుతోంది. దీంతో దుర్వాసన వ్యాపించి ఆయా చోట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు దోమలు, ఈగల వ్యాప్తి చెందుతున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవడంలేదు.శాంతినగర్‌, భవానీనగర్‌, సాయిపూరు, ఎన్టీఆర్‌ కాలనీ, పాత తాండూరు, గ్రీన్‌సిటీ, తులసీనగర్‌, ఆదర్శనగర్‌, విశ్వంబర కాలనీ, గొల్ల చెరువు, మార్కండేయ నగర్‌, అయ్యప్ప నగర్‌ కాలనీల్లో మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్‌ రోడ్లు వేసేందుకు నిధులు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడంలేదు.

కొరవడిన సమన్వయం
తాండూరు పురపాలికలోని అధికార పక్షం కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవీ కోసం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి ఎమ్మెల్సీకి, మరోటి ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. అంతర్గత ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవి చేపట్టిన వారు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రాజీనామా చేసేది లేదు, ఈ వ్యవహారం అధిష్ఠానం చూసుకుంటుందని ఎమ్మెల్సీ వర్గం పేర్కొంటోంది. ఇరువర్గాల పరస్పరం కుర్చీల కోసం పాకులాడుతున్నాయి తప్పితే, అభివృద్ధి పనుల విషయాన్ని పక్కకు పెట్టారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆరు నెలల కిందటే కేటాయించినా
వార్డుల్లో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతి వార్డుకు రూ.15 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆరు నెలల కిందటే నిధుల కేటాయించారు. ఇదే విషయమై రూపొందించిన ఎజెండాను పాలక పక్షంలోని కొందరు కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షంలోని మరి కొందరు ఆమోదించారు. అయితే రూపొందించిన ఎజెండా తన ప్రమేయం లేకుండానే జరిగి పోయిందని పేర్కొంటూ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఎజెండాలో పొందు పరిచిన పనులకు తాత్కాలికంగా బ్రేకు పడింది. ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎజెండాకు అనుమతి లభిస్తే తప్ప నిర్ణీత పనులకు టెండర్లు జరిగే పరిస్థితి లేదు.

ఏం జరుగుతుందో తెలియడం లేదు : స్వప్న, పురపాలిక అధ్యక్షురాలు, తాండూరు
అధికారిక కార్యకలాపాల సమాచారం చెప్పడంలేదు. కార్యాలయంలో ఏ అధికారి ఏం చేస్తున్నారో నా వరకు రావడం లేదు. ఎజెండాపై న్యాయస్థానానికి వెళ్లిన వ్యవహారానికి సంబంధించిన దస్త్రం ఉన్నతాధికారుల వద్ద ఉంది. తుది నిర్ణయం వారే తీసుకోవాల్సి ఉంది.

పనులు పెండింగులో ఉన్నది వాస్తవమే : అశోక్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి కమిషనర్‌
మున్సిపాలిటీలో చాలా పనులు పెండింగులో ఉన్న విషయం వాస్తవమే. రెండున్నరేళ్లలో 128 పనులకు టెండర్లు జరిగాయి. ఇందులో 40 పనులకు మాత్రమే గుత్తేదార్లు ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన వాటికి జరగలేదు. వ్యవహారం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని