logo
Published : 06 Aug 2022 02:56 IST

వాహన రంగంలో పెనుమార్పులు

ఆధునికతకు అద్దం పట్టిన ఆటోమొబైల్‌ ప్రదర్శన


హైటెక్స్‌లో ఆటోమొబైల్‌ ప్రదర్శనలో సందర్శకులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ రంగంలో వినూత్న మార్పులకు అద్దం పట్టింది హైటెక్స్‌లో ప్రారంభమైన మూడు రోజుల ఆటోమొబైల్‌ ప్రదర్శన. ఎలక్ట్రిక్‌ వాహనాల హొయలు, సౌకర్యాలు అందరినీ ఆకర్షించాయి. ఒక పక్క ఎలక్ట్రిక్‌ బస్సులు.. మరోపక్క అగ్నిప్రమాదానికి ఆస్కారం లేని ఇంటీరియల్‌ అందాలు ఇలా అనేక ఆకర్షణలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బస్సు ఆపరేటర్ల సంఘంతో కలిసి బస్సు, కారు ఆపరేటర్ల భారత సమాఖ్య ‘ప్రవాస్‌ 3.0’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన 3 రోజుల పాటు హైటెక్స్‌లో కొనసాగనుంది.

ఎలక్ట్రిక్‌ వాహనాల హవా.. కేవలం 2 గంటల ఛార్జింగ్‌తో..150 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే 35 సీటర్ల బస్సు నగర ప్రజా రవాణాకే కాకుండా.. విద్యాలయాలకు అనువుగా ఉంది. కేవలం కిలోమీటరుకు రూ.8.40 రూపాయలు ఖర్చు అవుతున్న ఈ బస్సులను పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు చెందిన రవాణా విభాగం అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీలో సిటీ బస్సు కిలోమీటరుకు రూ. 30 వరకూ ఇంధన వ్యయాన్ని ఆర్డినరీ బస్సులకు వెచ్చిస్తుండగా.. ఏసీ బస్సులకు రూ.35లు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం ఎంతో శ్రేయష్కరమే కాకుండా.. కాలుష్యం లేని ప్రయాణం కోసం ఈ బస్సులను పరిశీలిస్తున్నారు. వీటితోపాటు.. ఎలక్ట్రిక్‌ కార్లు కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైలులో మొదటి తరగతి ఏసీ రైలు ప్రయాణం మాదిరి పడకలున్న ఎలక్ట్రిక్‌ బస్సులు అందరూ తరచి చూస్తున్నారు.

ఇంటికే ఇంధనం వస్తే.. ఇంధనం కోసం పెట్రోలు బంకులకు పరుగులు పెట్టే కష్టం లేకుండా ఇంటికి తీసుకువస్తామని ఒక స్టార్టప్‌ కంపెనీ ముందుకొచ్చింది. రెపోస్‌ ఎనర్జీ పేరుతో ఎక్కువ మొత్తంలో డీజిల్‌ వినియోగించుకునేవారు బంకులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. 2 వేల లీటర్లను నిలువ ఉంచుకొని వాహనాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. గేటెడ్‌ కమ్యూనిటీలు కూడా దీనిని వినియోగించుకోవచ్ఛు కేవలం వాహనం ఆపేంత స్థలం ఉంటే చాలు. నేరుగా ఇంధన సంస్థల నుంచి పెట్రోలు బంకుల మాదిరే ఇంధనాన్ని సమకూర్చుకుని ఎక్కువ వాహనాలు వినియోగిస్తున్న వారి వద్దకే వెళ్లి డీజిల్‌ పోసేలా ‘డోర్‌స్టెప్‌ డీజిల్‌ డెలివరీ’ పేరిట మొబైల్‌ వాహనం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంది. 3 వేల లీటర్లు, 4 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాహనాలు నిరుద్యోగులకు ఉపాధితోపాటు.. బడా సంస్థల వాహనాల ఇబ్బందులు తీర్చేదిగా ఉంది.

వాహనం లోపల హంగులు

వాహనాలు అందరూ నడుపుతారు.. అందులో సౌకర్యాలు కొందరే చూస్తారు. ఆ సౌకర్యాలను అందరికీ పరిచయం చేస్తోంది ‘ప్రవాస్‌ 3.0’ ప్రదర్శన. కూర్చున్న సీటు నుంచి స్టీరింగ్‌ వరకూ, ఏసీ, సౌండ్‌ సిస్టమ్‌, డిజిటల్‌ లైటింగ్‌ వ్యవస్థ, అప్రమత్తం చేసే డివైజ్‌లు ఇలా వాహనాల్లో వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ ప్రదర్శన. కారవాన్‌లలో సౌకర్యవంతమైన ప్రయాణం, వాహనాల్లోకి లిఫ్టుమాదిరి ఎక్కే సదుపాయం, బస్సు టైర్లు సులభంగా మార్చేందుకు వినియోగించే పరికరాలు.. ఇలా అనేకం అకట్టుకుంటున్నాయి. ఓక్‌లేల్యాండ్‌, టాటామోటార్స్‌, వీఈ కమర్షియల్‌, రెడ్‌బస్‌, భారత్‌ బెంజ్‌, మహింద్రా, ఒలెక్ట్రా, కుమిన్స్‌, ఫోర్స్‌ మోటార్స్‌, ఎక్సైడ్‌ - లెక్లాంచ్‌, బ్లాక్‌ బక్‌ ఈవీ, బిట్ల సాఫ్ట్‌వేర్‌, వాలియో, ఎస్‌ఎంఎల్‌, ఇంటెల్‌, కీపీఐటీ, కిండ్రిల్‌ వంటి 200ల వరకూ ఉత్పత్తి సంస్థలు ప్రదర్శనలో భాగస్వామ్యమయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని