logo

సమయానికి నడిచేలా.. ఆదాయం పెరిగేలా!

నగరంలో వెయ్యి బస్సులు తగ్గిపోయిన వేళ.. ఆర్టీసీ సిటీ బస్సుల పరుగులకు ఒక లెక్క ఉండేలా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ చర్యలు తీసుకుంది. సమయానికి బస్సులు తిరిగేలా పక్కా ఏర్పాట్లు చేస్తోంది.

Published : 06 Aug 2022 02:56 IST

నగరంలో వెయ్యి బస్సులు తగ్గిపోయిన వేళ.. ఆర్టీసీ సిటీ బస్సుల పరుగులకు ఒక లెక్క ఉండేలా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ చర్యలు తీసుకుంది. సమయానికి బస్సులు తిరిగేలా పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సోమవారం ‘మండే ఛాలెంజ్‌’ వంటి కార్యక్రమాలతో బస్సులు సమయానికి నడిచేలా చూడడంతో పాటు.. ఎక్కువ కిలోమీటర్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదాయం విషయంలోనూ ఒక లక్ష్యం పెట్టుకుని బస్సులు నడుపుతోంది. ఈ మేరకు రీజనల్‌ మేనేజర్‌, డివిజనల్‌ మేనేజర్‌, డిపో మేనేజర్‌ స్థాయిలో ఎక్కడికక్కడ లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేస్తున్నారు.

ఈనాడు - హైదరాబాద్‌

బస్టాపుల్లో సమయ పట్టికలు..నగరంలోని ప్రధాన బస్టాపుల్లో బస్సుల సమయాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైనట్లు హైదరాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. అంతేకాకుండా.. ముఖ్యమైన బస్టాపుల్లో నియంత్రణ అధికారులను కూడా ఉంచి బస్సులు గొలుసుకట్టుగా రానీయకుండా.. సమయపాలన పాటించేలా చూడడం వీరి బాధ్యత. బస్‌షెల్టర్లున్న చోట డిజిటల్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేసి బస్సు ఎంత దూరంలో ఉందనే వివరాలు పెడుతున్నట్లు చెప్పారు.

ట్రాకింగ్‌ వ్యవస్థతో డిజిటల్‌ బోర్డులు.. బస్సులన్నింటికీ జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్న గ్రేటర్‌జోన్‌.. వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా బస్సు ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయంలో వస్తోంది అనే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ’ పేరిట ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్ఛి. ప్రయాణికుల సెల్‌ఫోనులో బస్సుల ట్రాకింగ్‌ వ్యవస్థ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సిబ్బంది.. ‘మండే ఛాలెంజ్‌’ పేరుతో బస్సులన్నింటినీ రోడ్డు ఎక్కించడమే కాకుండా.. సిబ్బందిని కూడా క్షేత్రస్థాయిలో ఉంచుతోంది. ఇలా హైదరాబాద్‌ రీజియన్‌ వరకూ గత సోమవారం 291 మంది క్షేత్రస్థాయిలో పని చేసి అనుకున్న లక్ష్యాలను అధిగమించామని రీజియన్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. సాధారణ రోజుల్లో 1347 బస్సులు 4.70 లక్షల కిలోమీటర్లు తిరిగితే.. మండే ఛాలెంజ్‌ పేరుతో 5 లక్షల కిలోమీటర్లు తిప్పాలని నిర్ణయించుకుంటే అదనంగా మరో 5 వేల కిలోమీటర్లు తిప్పామన్నారు. అలాగే రూ. 3 కోట్ల ఆదాయమనుకుంటే.. రూ. 3.5 కోట్లు ఆర్జించామన్నారు. ఇదేమాదిరి కసరత్తు సికింద్రాబాద్‌ రీజియన్‌లో కూడా నడుస్తోంది. డిపోకు వెయ్యి కిలోమీటర్లు అదనంగా తిప్పాలని.. ప్రతి డిపో నుంచి 5 బస్సులు అదనంగా నడపాలని.. నిర్ణయించుకున్నామని సికింద్రాబాద్‌ ఆర్‌ఎం వెంకన్న చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని