logo
Updated : 06 Aug 2022 08:42 IST

స్వగృహ ఫ్లాట్లు కేటాయించినా.. డబ్బు కట్టేవారేరి?

బండ్లగూడ, పోచారం రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే లాటరీలో ఫ్లాట్లు దక్కించుకున్న లబ్ధిదారులు టోకెన్‌ అడ్వాన్సు చెల్లించేందుకు ఆసక్తి చూపక పోవడం చర్చనీయాంశమవుతోంది. ఫ్లాటు ఖరీదులో 10 శాతం వరకు తొలుత టోకెన్‌ అడ్వాన్సు కింద చెల్లించాలి. గత నెల 12 వరకు తొలుత గడువు ఇచ్చారు. అయితే 40 శాతం మించి స్పందన రాకపోవడంతో గత నెల 31 వరకు గడువు పెంచారు. అయినా స్పందన అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

-ఈనాడు, హైదరాబాద్‌

మరో కొద్ది మంది మాత్రమే అడ్వాన్సులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అటు హెచ్‌ఎండీఏ ఇటు రాజీవ్‌ స్వగృహ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ సమాచారం లబ్ధిదారులకు తెలియాల్సి ఉన్నప్పటికీ వివరాలు వెల్లడించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ లబ్ధిదారులను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించిన వారిలో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే అడ్వాన్సు చెల్లింపు గడువు ముగిసిన దృష్ట్యా మరోసారి పెంచుతారా...లేదంటే ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తారా అనేది అధికారులు చెప్పడం లేదు. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో కలిపి 3బీహెచ్‌కే డీలక్స్‌, 3బీహెచ్‌కే, 2బీహెచ్‌కే 1బీహెచ్‌కే సంబంధించి మొత్తం 3716 ఫ్లాట్ల కోసం 39082 మంది దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ప్రతి దరఖాస్తుకు రూ.వెయ్యి వంతున సుమారు రూ.4 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖాతాకు చేరింది.

వాటికే డిమాండ్‌.. అయినా వెనకడుగు

ముఖ్యంగా బండ్లగూడలోని 3బీహెచ్‌కె డీలక్స్‌ ఫ్లాట్లకు ఎగబడి మరీ దరఖాస్తు చేశారు. ఈ కేటగిరిలో 345 ఫ్లాట్లు ఉండగా.. వాటి కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు దక్కించుకున్న వారు అడ్వాన్సు చెల్లింపులో మాత్రం వెనుకంజ వేస్తున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయడంలో అధికారులు సరైన చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న ధరలతో పోల్చితే తక్కువే అయినప్పటికీ వీటి నిర్వహణ, మౌలిక వసతులపై పలువురు వినియోగదారుల్లో తొలి నుంచీ అనుమానాలు ఉన్నాయి. సరైన నమ్మకం కుదరక పోవడం వల్లే గడువు పెంచినా సరే.. చాలామంది కొనేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. తొలుత 10 శాతం టోకెన్‌ అడ్వాన్సు తర్వాత రెండు నెలల్లో 80 శాతం, మిగతా మొత్తం 90 రోజుల్లో చెల్లిస్తే దరఖాస్తుదారు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. గతంలో గంపగుత్తగా వీటిని విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ టెండర్లు సైతం పిలిచింది. అయితే ఏ స్థిరాస్తి సంస్థ నుంచి కూడా బిడ్లు దాఖలు కాలేదు. దీంతో ఫ్లాట్ల వారీగా విక్రయించడానికి లాటరీ పద్ధతి నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని