logo
Published : 06 Aug 2022 02:56 IST

రైల్వేలో నకిలీ సహాయ లోకోపైలట్‌ కలకలం!


రహస్యంగా విచారిస్తున్న రైల్వే అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలో నకిలీ సహాయ లోకోపైలెట్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఇటీవల లోకోపైలెట్లు ధర్నా చేస్తుండగా ఈ నకిలీ వ్యక్తి బాగోతం బయట పడింది. లోకోపైలెట్‌ డ్రెస్‌ వేసుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ధర్నాలో ఉన్న లోకోపైలెట్లు ఆరాతీశారు. తనను తాను సహాయ లోకోపైలెట్‌గా పరిచయం చేసుకున్నాడు. గుర్తింపు కార్డు చూపించాడు. అనుమానంతో విచారించగా అతను నకిలీ అని తేలింది. ఈ విషయాన్ని జీఆర్‌పీ పోలీసులకు చెప్పగా.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. రెండు మూడు రోజులుగా అతన్ని జీఆర్‌పీ పోలీసులు విచారిస్తున్నారు.

గుర్తింపు కార్డు ఆధారంగా విచారణ

ద.మ. రైల్వే జారీ చేసినట్టుగా గుర్తింపు కార్డు ఉంది. మెడికల్‌ కార్డుగా దీన్ని వినియోగిస్తున్నట్లుంది. మెకానికల్‌ డివిజన్‌ సికింద్రాబాద్‌ పేరుతో ఉన్న ఈ గుర్తింపు కార్డుపైన పేరు బి.ప్రసాద్‌ అని ఉంది. హోదా వద్ద ఏఎల్‌పీ(అసిస్టెంట్‌ లోకోపైలట్‌)గా ముద్రితమైంది. కార్యాలయ చిరునామా సీసీసీ/ఒ/సికింద్రాబాద్‌, కార్డు నంబరు 2019/06-4160 రాసిఉంది. తనది మహబూబాబాద్‌ అని రైళ్లు నడపడం తనకిష్టమని.. లోకోపైలెట్‌ అవ్వాలనేది నా కోరిక.. అందుకే ఇలా దుస్తులు, ఐడీ కార్డు వేసుకుని చెలామణి అవుతున్నట్టు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. రైళ్ల ఇంజిన్లను నడిపిన వీడియోలు చూపించినట్టు సమాచారం.

విధులు కష్టమే.. లోకోపైలెట్‌ అవ్వాలనే కోరికతో అందుకు తగ్గ డ్రెస్‌ వేసుకోవడం, నకిలీ గుర్తింపుకార్డు సృష్టించడం సులభమే అయినా.. విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైలు ఇంజిన్‌ క్యాబిన్‌లో సీసీ టీవీ కెమెరాలుంటాయని, వేలి ముద్రలు తీసుకున్నాకే విధులు అప్పగిస్తారని స్పష్టంచేశారు. ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌ చేసినవారు ఆర్‌ఆర్‌బీ పరీక్ష ద్వారా ఎంపికవుతారు. తర్వాత ఒక ఏడాది క్షేత్రస్థాయిలో, తరగతి గదుల్లో శిక్షణ ఉంటుంది. తర్వాత సహాయ లోకోపైలెట్‌గా గూడ్సు రైళ్లలో వెళ్తారు. తర్వాత ప్యాసింజర్‌ రైలులో.. తర్వాత లోకోపైలెట్‌గా గూడ్సు రైళ్లను నడుపుతారు. స్టేషన్లలో రైలుతో ఇంజిన్‌ను జతచేయడం వంటి విధులు నిర్వర్తించాక... ప్యాసింజర్‌ రైళ్లలో ముందుగా లోకోపైలెట్‌గా వెళ్లి.. తర్వాత ఎక్స్‌ప్రెస్‌లకు పంపుతారని.. ఇంత కఠిన నియమాలున్నప్పుడు నకిలీ సహాయ లోకోపైలెట్‌గా రైలు ఇంజిన్‌లోకి ప్రవేశించడం కష్టమని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరి అతని దగ్గర ఉన్న వీడియోలేంటి.. అసలు ఎలా రైల్వేలోకి వచ్చాడు.. పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts