logo

వీఆర్వోల సర్దుబాట

గ్రామ రెవెన్యూ అధికారుల సర్దుబాటు వ్యవహారం దాదాపుగా ముగిసినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వీఆర్వోలు తిరిగి విధుల్లో చేరారు. రెండు జిల్లాల్లో సర్దుబాటుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated : 06 Aug 2022 02:40 IST

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో విధులకు హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల సర్దుబాటు వ్యవహారం దాదాపుగా ముగిసినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వీఆర్వోలు తిరిగి విధుల్లో చేరారు. రెండు జిల్లాల్లో సర్దుబాటుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ హైదరాబాద్‌ జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. నాలుగు రోజుల కిందట రెండు జిల్లాలకు చెందిన వీఆర్వోలను శాఖల వారీగా సర్దుబాటు చేసేందుకు డ్రా పద్ధతి అవలంబించారు. ముందుగా ఆయా జిల్లాల్లోని 40 శాఖల పరిధిలోని ఖాళీలను గుర్తించారు. వీడియో రికార్డింగ్‌ చేస్తూ డ్రా తీసి ఆయా శాఖల కేటాయించారు.

* సర్దుబాటు చేయడంపై వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కోర్టులను ఆశ్రయించారు. వీఆర్వోలతో ప్రత్యేకంగా మాట్లాడి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అమోయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేటాయించిన శాఖల్లో చేరాలని సూచించారు. వీఆర్వోలు విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి విధుల్లో చేరారు. మిగిలిన జిల్లాల్లో ఇంకా చర్చల దశలో ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ జిల్లాలో 84 మందికి గాను 74 మంది, రంగారెడ్డిలో 274 మందికి 240 మంది శుక్రవారం పనుల్లో చేరారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు!

వీఆర్వోల వ్యవస్థ రద్దు కావడం.. వారిని వేరొక శాఖల్లో సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడితో ఉన్న తహసీల్దారు, ఆర్‌ఐలపై మరింత పని భారం పెరుగుతోందని చెబుతున్నారు. గతంలో కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పరిశీలన వీఆర్వోలు చేపట్టేవారు. ప్రస్తుతం నగరంలో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు అవసరం ఉన్న నేపథ్యంలో నిత్యం 100-150 మధ్య పరిశీలన చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈ భారం పూర్తిగా ఆర్‌ఐలపై పడింది. విద్యా సంవత్సరం ఆరంభంలో ధ్రువీకరణ పత్రాలకు డిమాండ్‌ ఉంటుంది. కొన్నిచోట్ల సరైన ధ్రువీకరణ లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరంలో భూముల ఆక్రమణలు ఎక్కువగా చోటుచేసుకుంటుంటాయి. వీటిపై పర్యవేక్షణ కొరవడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్థానికంగా మరింత నిఘా లేకపోతే ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెచ్చరిల్లే అవకాశం ఉందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని