logo

తీగ తీయాలని చెప్పాలా!

విద్యుత్తు నిర్వహణ మరమ్మతులను క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. కరెంటు పోయే పరిస్థితులు కళ్ల ముందు కనబడుతున్నా..

Published : 06 Aug 2022 02:56 IST

విద్యుత్తు సంస్థలో క్షేత్రస్థాయిలో అల్లుకున్న నిర్లక్ష్యం


సరూర్‌నగర్‌ పోస్టాఫీసు నుంచి బైరామల్‌గూడ వెళ్లే మార్గంలో స్తంభాలకు ఎగబాకిన తీగలు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు నిర్వహణ మరమ్మతులను క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. కరెంటు పోయే పరిస్థితులు కళ్ల ముందు కనబడుతున్నా.. తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సెంట్రల్‌ బ్రేక్‌డౌన్‌ (సీబీడీ), ఆపరేషన్‌ సిబ్బంది.. ఫిర్యాదు వస్తేనే స్పందిస్తున్నారు. ఇంజినీర్ల పర్యవేక్షణ లోపమూ కనబడుతోంది.

* సరూర్‌నగర్‌ తపాలా కార్యాలయం నుంచి బైరామల్‌గూడ వెళ్లే దారిలో పది విద్యుత్తు స్తంభాలకు, నియంత్రికలకు తీగలు అల్లుకున్నాయి. ఈ మార్గంలో నిత్యం విద్యుత్తు సిబ్బంది తిరుగుతుంటారు. తీగల మొదళ్ల వద్ద తుంచేస్తే రెండు రోజుల్లో ఎండిపోతుంది. నెల రోజులుగా అలాగే వదిలేశారు. వర్షాలకు అవి ఏపుగా పెరిగి విద్యుత్తు సరఫరాకు ఆటంకంగా మారాయి.

* హైదర్‌గూడలో ఇటీవల ఓ విద్యుత్తు నియంత్రికకు చెట్ల కొమ్మలు తాకి సరఫరా ఆగిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేశారే కానీ చెట్టు కొమ్మను తొలగించలేదు. అది గుత్తేదారు పని అని వదిలేశారు.

అనుమతులు రాక.. భూగర్భ కేబుళ్ల నిర్వహణపై డిస్కం శ్రద్ధ వహించడం లేదు. యూజీ కేబుల్స్‌లో తరచూ అంతరాయాలు వేధిస్తున్నాయి. రహదారులపై రక్షణ తొడుగు తొలగిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇదివరకు ఎక్కడంటే అక్కడ అత్యవసరం పేరుతో.. తవ్వి మరమ్మతులు చేసేవారు. రోడ్ల నిర్వహణను జీహెచ్‌ఎంసీ సీఆర్‌ఎంపీకి అప్పగించడంతో.. తవ్వకాలకు అనుమతులు కష్టమైంది. సమస్య రాకుండా ముందస్తుగా నిర్వహణ పక్కాగా ఉంటే.. ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.

తేమ చేరి..

వానాకాలంలో విద్యుత్తు అంతరాయాల నివారణకు సంబంధించి రింగ్‌ మెయిన్‌ యూనిట్ల నుంచి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఆర్‌ఎంయూలు పాదబాటలపైనే ఉంటాయి. వరద లొచ్చినప్పుడు నీట మునుగుతాయి. వానలతో చాలాచోట్ల తేమ చేరి మొరాయిస్తున్నాయి. సమయానుకూల నిర్వహణ లేకపోవడమే సమస్యలకు కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని