logo
Updated : 06 Aug 2022 09:27 IST

Hyderabad: సర్‌.. డబ్బులు లేదంటున్నా.. రూ.2వేలు వసూలు చేశారు!

మంత్రి ముందే వాపోయిన బాలింత

ఇలాంటివి ఉపేక్షించం: హరీశ్‌రావు


శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని గర్భిణులకు పసుపు, కుంకుమ అందిస్తున్న
మంత్రి హరీశ్‌రావు, కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, చార్మినార్‌: కాన్పునకు వచ్చిన మహిళ నుంచి రూ.2 వేలు వసూలు చేసిన ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. తన వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు తీసుకున్నారని ఓ మహిళ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద వాపోయింది. పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకును ప్రారంభించేందుకు శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. బాలింతలు, గర్భిణులను ఒకచోట సమావేశ పరిచి వారి ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పాతబస్తీకి చెందిన బాలింత తస్రీమాబేగం మాట్లాడుతూ.. తన డబ్బుల్లేవని వేడుకున్నా, ఆసుపత్రి సిబ్బంది రూ.2 వేలు బలవంతంగా వసూలు చేశారని మంత్రి దృష్టికి తెచ్చింది. అత్యవసర ఖర్చుల కోసం తన తల్లి ఇచ్చిన డబ్బులనూ తీసుకున్నారని కన్నీమున్నీరైంది. మంత్రి ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతిని వివరణ కోరారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా ఉపేక్షించొద్దని, అలాంటి వారిని ఇంటికి పంపడమే కాకుండా పోలీసు కేసూ పెట్టాలని ఆదేశించారు. శానిటేషన్‌, ఇతర ఖర్చులకు పడకకు రూ.700 కేటాయిస్తున్నా రోగుల నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సిబ్బంది చేతివాటం వల్ల ఆసుపత్రికే చెడ్డ పేరు వస్తోందని, మానుకోవాలని హితవు పలికారు. చాదర్‌ఘాట్‌కు చెందిన సునీత మాట్లాడుతూ, ఒకే మంచాన్ని ఇద్దరికి కేటాయిస్తున్నారని చెప్పడంతో, సరిపడా పడకలు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు వార్డులు, ల్యాబ్‌ల వద్ద నిరీక్షిస్తున్న గర్భిణులు, రోగులతో హరీశ్‌రావు మాట్లాడారు. గర్భిణులకు సత్వరం పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు.


మంత్రికి తన ఆవేదన వివరిస్తూ కంటనీరు పెట్టుకున్న తస్రీమాబేగం

వసూళ్లపై ఆది నుంచి ఆరోపణలు

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసూతి విభాగాల్లో బాలింతల నుంచి వసూళ్లకు సంబంధించి గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. గాంధీ, నిలోఫర్‌, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ దవాఖానాల్లో ఆడపిల్ల పుడితే ఒక మొత్తం.. మగ శిశువుకైతే మరో మొత్తం వసూలు చేస్తున్నారు. గతంలో కోర్టు అక్షింతలు వేసినా.. తీరు మారడం లేదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts