logo

‘దూర విద్యా’వంతులు.. బంగారు పతకధారులు

ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారాలు చేసుకునేవారు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు.. ఇలా విభిన్న అంశాలకు చెందిన వారు రెగ్యులర్‌ కళాశాల లేదా యూనివర్సిటీకి వెళ్లి చదువుకోవడం సాధ్యపడని పరిస్థితి.

Published : 07 Aug 2022 02:16 IST

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మాదాపూర్‌: ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారాలు చేసుకునేవారు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు.. ఇలా విభిన్న అంశాలకు చెందిన వారు రెగ్యులర్‌ కళాశాల లేదా యూనివర్సిటీకి వెళ్లి చదువుకోవడం సాధ్యపడని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారికి దూరవిద్య వరంలా లభించింది. వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటూనే డిగ్రీలు, పీజీలు చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులుగా మారి.. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో 87 మంది మహిళలు, 41 మంది పురుష విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. పతకాలు అందుకున్న పలువురు ‘ఈనాడు’తో అభిప్రాయాలు పంచుకున్నారు.


సివిల్‌ సర్వీసెస్‌ సాధిస్తా: బి.సుమన, నాలుగు బంగారు పతకాలు

ఇంటర్‌ పూర్తయ్యాక గ్రామ రెవెన్యూ అధికారిణిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే అంబేడ్కర్‌ వర్సిటీ నుంచి దూరవిద్యలో బీఎస్సీ పూర్తి చేశా. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. 2019 బ్యాచ్‌లో టాపర్‌గా నిలవడంతోపాటు బీఎస్సీ, బీఈడీలో టాపర్‌గా నిలిచినందుకు బంగారు పతకాలు వచ్చాయి. ప్రస్తుతం దూరవిద్యతో ఎమ్మెస్సీ(గణితం) చదువుతున్నా. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలనేది లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నిస్తున్నా.


పట్టుదలతో సాధ్యమే: కె. స్వాతి, రెండు బంగారు పతకాలు

మాది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నా. ఎంఏ తెలుగులో రెండు బంగారు పతకాలు వచ్చాయి. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో చదువును కొనసాగించగలిగా. స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధంచాలనుకుంటున్నా. వివాహమై ఏడాది దాటింది. ప్రస్తుతం గర్భిణిని. ఉన్నత చదువులకు భర్త నుంచి పూర్తి సహకారం ఉంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్నది సాధించగలం.


పీహెచ్‌డీ చేయాలనుంది: జె.రజిని, రెండు బంగారు పతకాలు

ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలంయంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బోధకురాలిగా పనిచేస్తున్నా. ఎంఏ తెలుగులో టాపర్‌గా నిలిచినందుకు రెండు బంగారు పతకాలు లభించాయి. భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా. ఎప్పటికైనా సొంతంగా వ్యాపారం ప్రారంభించి, మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు సాధించాలనేది లక్ష్యం.


జైలు జీవితంలోనూ ఉన్నత విద్యాభ్యాసం

తెలుగు రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలుగా ఉన్న వారిలో 282 మంది అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీ నుంచి దూరవిద్య కోర్సులు పూర్తి చేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండే షేక్‌ అజారుద్దీన్‌ డిగ్రీలో.. కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న సురేశ్‌రెడ్డి, రమేశ్‌బాబు పీజీలో గోల్డ్‌మెడళ్లు సాధించారు.


బీఏ తెలుగు కోర్సు పూర్తి చేశా: రమేశ్‌బాబు, డిగ్రీ, విద్యానగర్‌

2014లో ఓ కేసు విషయంలో జైలుకు వచ్చాను. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ తరఫున దూరవిద్య కేంద్రంలో విద్యనభ్యసించేందుకు వీలుందని తెలిసింది. 2015-18 మధ్య బీఏ తెలుగు చదివి ఉత్తీర్ణుడయ్యాను. చిన్నప్పుడు డిగ్రీ చదువుకోలేకపోయా. ఇప్పుడు ఆ ఆశయం తీరింది. రోజూ రెండు గంటలపాటు విద్యాభ్యాసానికి కేటాయిస్తున్నాను.


పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా: అమేర్‌ మహ్మద్‌ జమాల్‌, ఎమ్మెస్సీ, సికింద్రాబాద్‌

నాకు ఓ కేసులో తొమ్మిదేళ్ల జైలుశిక్ష పడింది. చర్లపల్లి కారాగారంలో ఉన్నా. 2017-19 బ్యాచ్‌లో అంబేడ్కర్‌ వర్సిటీ నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశా. ప్రస్తుతం పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా. జైలుకు వచ్చాక నా ఆలోచనల్లో పలు మార్పులు వచ్చాయి. చదువు కొనసాగించేలా ఓయూ సైకాలజీ ఆచార్యురాలు ప్రొ.సి.బీనా ప్రోత్సహించారు.


చదువుపై ఆసక్తి పెరిగింది: శ్రీధర్‌(ఎమ్మెస్సీ)

మాది మంచిర్యాల. జీవిత ఖైదు పడింది. చర్లపల్లి జైల్లో ఉంటున్నా. 2013-16 మధ్య జైల్లోనే డిగ్రీ పూర్తి చేశా. ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షలు రాశాను. జైలుకు వచ్చాక చదువుపై నాలో తెలియని ఆసక్తి ఏర్పడింది. అప్పట్లో ఇంటర్‌తోనే ఆపేశాను. ఇప్పుడు డిగ్రీ చేసి పీజీ పరీక్షలు రాశా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని