logo

స్పందించరు.. సహకరించరు..

తాండూరు పురపాలక సంఘం సమావేశం అధికారుల తీరుపై ఆగ్రహం మినహా మొదటిసారిగా ప్రశాంతంగా సాగింది. గత రెండున్నరేళ్లల్లో ఎలాంటి వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరుపులు కేకలు లేకుండా జరగడం ఇదే మొదటిసారని సభ్యులు పేర్కొన్నారు.

Published : 07 Aug 2022 02:22 IST

అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం


వివరాలను వెల్లడిస్తున్న అధ్యక్షురాలు స్వప్న, కౌన్సిలర్లు

తాండూరు టౌన్‌: తాండూరు పురపాలక సంఘం సమావేశం అధికారుల తీరుపై ఆగ్రహం మినహా మొదటిసారిగా ప్రశాంతంగా సాగింది. గత రెండున్నరేళ్లల్లో ఎలాంటి వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అరుపులు కేకలు లేకుండా జరగడం ఇదే మొదటిసారని సభ్యులు పేర్కొన్నారు. అధ్యక్షురాలు స్వప్న అధ్యక్షతన శనివారం అత్యవసర సమావేశం నిర్వహించగా ఆ వివరాలను ఆమె తోటి కౌన్సిలర్లతో కలిసి విలేకరులకు వివరించారు. మూడు అజెండా అంశాలతో పాటు మరో మూడు టేబుల్‌ అజెండాలను ఆమోదించారు. అధికారులు తమకు సహకరించటం లేదని అధ్యక్షురాలితో పాటు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వివరించటానికి ఫోన్లు చేసినా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము ప్రస్తావించిన సమస్యలపై స్పందించి పరిష్కరించక పోతే అధికారులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

వారం రోజులపాటు స్వాతంత్య్ర వేడుకలు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజుల పాటు ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి జాతీయ పతాకం స్టిక్కర్లను అతికించాలని ఇందుకు అవసరమైన జెండాలను సమకూర్చాలని తీర్మానించారు. దీనికోసం వార్డుకు 5 మంది సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. సమావేశంలో మొత్తం 36 మంది కౌన్సిలర్లకు 18 మంది మాత్రమే పాల్గొన్నారు. వారిలో 10 మంది తెరాస, భాజపా 4, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 2 కౌన్సిలర్లు ఉన్నారు. గైర్హాజరైన వారిలో ఉపాధ్యక్షురాలు దీప సైతం రాకపోవడం గమనార్హం. కార్యక్రమంలో తెరాస ఫ్లోర్‌ లీడరు శోభారాణి, కౌన్సిలర్లు నీరజ, రత్నమాల, అబ్దుల్‌ రజాక్‌, రవి రాజ్‌, రామకృష్ణ, వెంకన్న గౌడ్‌, సల్మా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని