logo

రూ.5కే మధ్యాహ్న భోజనం..!

వ్యవసాయదారులు పండించిన ఉత్పత్తులను ప్రతి సోమ, గురువారాలు విక్రయానికి వికారాబాద్‌ మార్కెట్‌కు తీసుకు వస్తారు. వీరు ఉదయం వస్తే అమ్మకం జరిగే వరకు మార్కెట్‌లోనే ఉంటారు.

Published : 07 Aug 2022 02:27 IST

మార్కెట్‌ యార్డులో అమలుకు చర్యలు

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వ్యవసాయదారులు పండించిన ఉత్పత్తులను ప్రతి సోమ, గురువారాలు విక్రయానికి వికారాబాద్‌ మార్కెట్‌కు తీసుకు వస్తారు. వీరు ఉదయం వస్తే అమ్మకం జరిగే వరకు మార్కెట్‌లోనే ఉంటారు. ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో మధ్యాహ్నం వేళ భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లలో భోజనం చేయాలంటే ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది రైతులు మధ్యాహ్న భోజనం చేయకుండానే తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన మార్కెట్‌ శాఖ మధ్యాహ్నం అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో రూ.5లకే రుచికరమైన భోజనాన్ని అందించటానికి చర్యలు తీసుకుంటున్నారు.

రూ.4.18 లక్షల మంజూరు

రైతులకు రూ.5కే భోజనం అందించటానికి డైరెక్టర్‌ (వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ) రూ.4.18 లక్షలు వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీకి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నపూర్ణ పథకం పేరుతో దీనిని కొనసాగించాలని సూచించారు. ఆగస్టు నెల నుంచి నాలుగు నెలల పాటు నవంబర్‌ వరకు కొనసాగించటానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా వికారాబాద్‌లో అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులో తెలిపారు.

360 మంది రైతులకు తీరనున్న ఆకలి బాధ

హైదరాబాద్‌ మహానగరంలో అన్నపూర్ణ పథకం పేరుతో పేదలకు రూ.5లకు భోజనాన్ని అందిస్తున్నారు. ఈ పథకం 2014లో 5 కేంద్రాల్లో ప్రారంభించి నేడు 150 కేంద్రాలకు విస్తరించింది. ఇలాంటి అన్నపూర్ణ పథకాన్నే వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ నిర్వాహకులు ప్రారంభించబోతున్నారు. ప్రతి సోమ, గురువారాల్లో 360 రైతులకు ఈ సౌకర్యాన్ని కల్పించటానికి చర్యలు తీసుకుంటున్నారు.

త్వరలోనే ప్రారంభిస్తాం : - ముద్ద దీపభక్త, అధ్యక్షురాలు, చంద్రశేఖర్‌రెడ్డి ఉపాధ్యక్షుడు, వికారాబాద్‌

పట్టణంలో రైతుల కోసం రూ.5లకే భోజన పథకాన్ని రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభించాలని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఈ పథకం కోసం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నాలుగు నెలలకు సరిపడే నిధులు కేటాయించింది. దీన్ని రైతులకు సద్వినియోగం చేసుకుంటే నిరంతరంగా పథకాన్ని కొనసాగిస్తాం. ఎమ్మెల్యే ఆనంద్‌ కృషితోనే ఈ పథకం ప్రారంభించబోతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని