logo

వర్షం.. తెచ్చింది పుడమికి బలం

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేసింది. మీటరు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు జలమట్టం పెరిగింది. 2021 జులై నెల నుంచి ఈ ఏడాది జులై చివరి వరకు

Published : 08 Aug 2022 03:12 IST

పెరిగిన భూ గర్భ జలం


ఉరకలెత్తిన శివసాగర్‌ జలాశయం

న్యూస్‌టుడే, తాండూరు: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేసింది. మీటరు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు జలమట్టం పెరిగింది. 2021 జులై నెల నుంచి ఈ ఏడాది జులై చివరి వరకు  ఫిజియో మీటరు ఆధారంగా నమోదైన గణాంకాలను భూగర్భ జల వనరుల శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. దీని ఆధారంగానే జిల్లాలో ఏ గ్రామంలో ఎంత మేర జలమట్టం నమోదైందో రికార్డుల్లో పొందు పరిచారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

జలాశయాలు, చెరువులు నిండిపోవడంతో..

జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,175 చెరువులకు గాను 367 చెరువుల్లోకి సామర్థ్యానికి మించిన నీరు వచ్చింది. మరో 145 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం మేర చేరింది. 116 చెరువుల్లోకి 25 శాతం నుంచి 50 శాతం, 105 చెరువుల్లోకి 25 శాతం కంటే తక్కువ నీరు చేరింది. కోట్‌పల్లి, లక్నాపూరు, సర్పన్‌పల్లి, జుంటుపల్లి జలాశయాల్లోకి కూడా స్థాయికి మించిన నీరు వచ్చింది. ఒక్కో చెరువు శిఖం భూమి 300 ఎకరాల నుంచి 1,750 ఎకరాల్లో విస్తరించింది. 10 అడుగుల నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రస్తుతం నీరు నిల్వ ఉండడంతో భూమిలోకి వేగంగా ఇంకి పోతుంది.


కి.మీ నుంచి 10 కి.మీ. వరకు ప్రవాహం

చెరువులు, జలాశయాల్లో నిండిన నీరు పరిసరాల్లోని కిలోమీటరు విస్తీర్ణం నుంచి 10 కిలో మీటర్ల విస్తీర్ణం వరకు భూగర్భంలోకి ఇంకి పోతుంది. ఈ కారణంగానే లోతులో ఉన్న జలం క్రమేసి పైకి వచ్చింది.  

* భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధానమైన మూసీ, కాగ్నా, కాకరవేణి నదులతో పాటు గ్రామాల సమీపంలోని వాగులు కూడా వరద]తో ఉద్ధృతంగా ప్రవహించాయి.ఈ నేపథ్యంలో పరివాహకంగా ఉన్న అన్ని బోర్లలో జల మట్టం గణనీయంగా పెరిగింది.

* అడవుల్లో నిర్మించిన కుంటలు, ఆనకట్టలు కూడా భారీ వర్షాల కారణంగా నీటితో నిండాయి. దీంతో పరిసరాల్లో పెరుగుతున్న చెట్లకు భూమి నుంచి తేమ శాతం కావాల్సిన మేర లభించడంతో ఏపుగా పెరిగేందుకు దోహదం చేసింది.  


కొన్ని నిదర్శనాలు

* పెద్దేముల్‌ గ్రామంలోని ఒకరి ఇటిపై ఉన్న 500 లీటర్ల నీటి ట్యాంకు ఇంతకు ముందు బోరు స్టార్ట్‌ చేసిన 6 నిమిషాల్లో నిండేది. ప్రస్తుతం పెరిగిన జలమట్టంతో బోరు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి కారణంగా కేవలం నాలుగు నిమిషాల్లోనే నిండుతుంది.

* యాలాల మండలం సంగెం కుర్దు గ్రామ సమీపం కాగ్నానది పరివాహకంగా ఉన్న బోర్లలో 8 మీటర్ల లోతులో నీరు ఉండేది. ప్రస్తుతం 6 మీటర్లలోనే నీరు కనిపిస్తోంది.

* శివసాగర్‌ జలాశయం కింది భాగంలో ఉన్న విశ్వనాథ్‌ పూరు గ్రామంలోని బోర్లలో నీటి ఒత్తిడి పెరిగింది.


వరద ఎక్కువగా వృథా కాలేదు
- దీపారెడ్డి, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి

భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరద చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతలు, పర్కులేషన్‌ ట్యాంకుల్లోకి చేరింది. ఈ కారణంగా నీరు ఎక్కువగా వృథా కాలేదు. నీరు నిల్వ ఉన్న వనరుల కారణంగా పరిసరాల్లోని బోర్లు, బావుల్లో జలమట్టం పెరిగింది. భూమి పొరల్లోనూ నీరు ఎక్కువగా ఉంది. ఇది శుభ పరిణామం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని