logo

నిండుకున్న నిల్వలు.. సరఫరాకు నిరీక్షణ

ఆహార భద్రత కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి ఒక్కో లబ్ధి దారునికి 15కిలోల చొప్పున పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. గోదాంలలో బియ్యం

Published : 08 Aug 2022 03:12 IST

70 శాతం దుకాణాలకు చేరని బియ్యం


బియ్యం కోసం వేచి చూస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ  : ఆహార భద్రత కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి ఒక్కో లబ్ధి దారునికి 15కిలోల చొప్పున పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. గోదాంలలో బియ్యం నిల్వలు నిండుకోవడంతో చౌకదుకాణాలకు చేరవేత ప్రక్రియ స్తంభించింది. చర్లపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాం నుంచి బియ్యం లారీల రాకకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

తాండూరులోని పౌరసరఫరాల గోదాంలో బియ్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. దీంతో పక్కనున్న మరో గోదాంలోని అరకొర నిల్వల్ని వారం రోజులుగా 20 దుకాణాలకు చేరవేశారు. దీంతో తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణంలోని దాదాపు 130 చౌకదుకాణాలకు 30వేల క్వింటాళ్ల బియ్యం చేరవేయాల్సి ఉంది. నిల్వలు లేకపోవడంతో మూడు రోజులుగా పౌరసరఫరాల గోదాం వద్ద హమాలీలు, డీసీఎం సిబ్బంది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్లపల్లి నుంచి వచ్చే బియ్యం లారీల కోసం నిరీక్షించి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదివారం గోదాంను మూసివేశారు. బియ్యం లేనందున మూసినట్లు గోదాం బాధ్యులు రవికుమార్‌ వెల్లడించారు.  

లబ్ధిదారుల ఆరా..  

చౌకదుకాణాల్లో ప్రతినెలా మొదటి వారంలో ఆహార భద్రత కార్డుదారులకు పంపిణీ ప్రారంభమవుతుండగా ఈసారి జాప్యం జరిగింది. గోదాంలో బియ్యం నిండుకున్న కారణంగా చౌకదుకాణాలకు చేరలేదు. కార్డుదారులు బియ్యం ఎప్పుడు వస్తాయంటూ దుకాణదారులను ఆరా తీస్తున్నారు. 8 తేదీ వచ్చినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంతో కార్డుదారులకు ఎదురుచూపులు మిగిలాయి. మరోవైపు అదనపు కోటా ఉండటంతో గోదాంల నుంచి చౌకదుకాణాలకు రెండు పర్యాయాలు చేరయాల్సి ఉండగా మరింత ఆలస్యమయ్యే ఆస్కారముంది. దీని ప్రభావంతో దుకాణాల్లోనూ పంపిణీలో జాప్యానికి దారితీయనుంది. అధికారులు దృష్టిసారించి సరిపడా బియ్యం నిల్వలను గోదాంలో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కార్డుదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని