logo

మాట వినలేదని నేలకేసి కొట్టాడు

అప్పటికే నలుగురు ఆడపిల్లలు కలిగారు.. భార్య మళ్లీ నిండు గర్భిణి.. చాలీచాలని సంపాదనతో ఆర్థిక ఇబ్బందులు వచ్చిపడ్డాయి.. ఇంటిని నెట్టుకురావటం కష్టమైంది. ఇదంతా కోపంగా మారింది. భార్యాపిల్లలపై చూపటం ప్రారంభించాడు.

Published : 08 Aug 2022 02:58 IST

మూడేళ్ల చిన్నారిపై తండ్రి కర్కశత్వం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: అప్పటికే నలుగురు ఆడపిల్లలు కలిగారు.. భార్య మళ్లీ నిండు గర్భిణి.. చాలీచాలని సంపాదనతో ఆర్థిక ఇబ్బందులు వచ్చిపడ్డాయి.. ఇంటిని నెట్టుకురావటం కష్టమైంది. ఇదంతా కోపంగా మారింది. భార్యాపిల్లలపై చూపటం ప్రారంభించాడు. తండ్రిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుతో పిల్లలు ఆయన మాట వినపడితేనే వణికిపోయేవారు. ఆ విసుగు చివరకు ఓ కుమార్తె ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ నివాసి బాసిత్‌ అలీఖాన్‌, ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లోని అద్దె ఇంట్లో నివాసం. సనా ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ప్రసవ సమయం దగ్గరపడుతున్న కొద్దీ బాసిత్‌లో ఆందోళన. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన చాలట్లేదు. కాన్పు ఖర్చులు కంగారెత్తిస్తున్నాయి. ఐదోసారి ఆడపిల్ల పుడితే కష్టమంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుండేవాడు. ఇదే కోపాన్ని పిల్లలపై ప్రదర్శించేవాడు. బిడ్డలు మారాం చేసినపుడు కొట్టేవాడు. శనివారం సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కుమార్తె సకీనా ఫాతిమా(3) స్నానాల గదిలో ఆడుకుంటోంది. బయటకు రమ్మని తండ్రి పిలిస్తే వెళ్లలేదు. పట్టలేని కోపంతో పెద్ద చెంచాతో బలంగా కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. కిందపడి ఆమె స్పృహతప్పింది. కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటకెళ్లిపోయాడు. స్పృహ వచ్చాక చూసి కుమార్తె నిద్రపోతోందని తల్లి భావించింది. కొద్దిసేపటి తరువాత పాలు పట్టేందుకు లేపేందుకు యత్నించగా, శరీరం చల్లగా ఉండటం.. నోటి నుంచి నురగలు రావటంతో ఆందోళనకు గురైంది. వెంటనే నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుమార్తె విషయం భార్య ద్వారా తెలుసుకున్న బాసిత్‌ ఉస్మానియా వద్దకు వెళ్లి కన్నబిడ్డ పరిస్థితి చూసి కూలబడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు. భర్త జైలుకెళితే తమ పరిస్థితి ఏంటని భార్య కన్నీరుమున్నీరవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని