logo

Hyderabad News: రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌తో తాజాగా చిన్నారికి వైద్యం

మానవత్వం వెల్లివిరుస్తోంది. చిన్నారుల్లో అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తలో చేయి వేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్‌,

Updated : 08 Aug 2022 11:29 IST

అరుదైన వ్యాధి.. ఆదుకుంటున్న మానవత్వం


చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి చిత్రం

ఈనాడు, హైదరాబాద్‌: మానవత్వం వెల్లివిరుస్తోంది. చిన్నారుల్లో అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తలో చేయి వేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్‌, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి సోకిన ఈ అరుదైన వ్యాధికి దాతల సాయంతో వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్‌ ఫార్మా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఉచితంగా అందజేసింది. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండటంతో తాజాగా చిన్నారిని డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు.

నడవలేరు.. తినలేరు

స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపి-2(ఎస్‌ఎమ్‌ఏ)గా వ్యవహరించే ఈ వ్యాధి వల్ల మెదడు కండరాలు క్షీణిస్తాయి. చిన్నప్పుడే బయట పడుతుంది. ఇందులో టైప్‌ 1, 2 ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మాట్లాడకపోవడం.. నడవక పోవడం.. పడుకొని లేవలేకపోవడం..ఆహారం మింగలేకపోవడం ప్రధాన లక్షణాలు. గతంలో రాజస్థాన్‌కు చెందిన నూర్‌ఫాతిమా(6 నెలలు)కు ఈ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా రూ.40 లక్షల వరకు సేకరించారు. కేంద్రం రూ.6 కోట్ల మేర పన్నులను తగ్గించింది. అప్పటికే చికిత్సలో జాప్యం జరగడంతో చిన్నారి మృతి చెందింది.


ఇంజక్షన్‌ ఖరీదు రూ.కోట్లలోనే..

ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే జోల్‌జెన్‌స్మా అనే ఇంజక్షన్‌ ఇవ్వాలి. అమెరికా లేదా స్విట్జర్లాండ్‌ నుంచి తెప్పించాలి. పన్నులతో కలిపి ఖరీదు రూ.22 కోట్లు అవుతుంది. మానవీయ కోణంలో దీనిపై ఉన్న ఎక్సైజ్‌ సుంకం, జీఎస్టీ కలిపి రూ.6 కోట్లను కేంద్రం ఎత్తేసింది. అయినా కొనడం కష్టం కావడంతో కొందరు క్రౌడ్‌ ఫండింగ్‌తో నిధులు సేకరిస్తుంటారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఆయాన్స్‌గుప్తాకి సోకడంతో ఇంపాక్ట్‌గురు అనే ఆన్‌లైన్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సంస్థ ద్వారా పిలుపు ఇవ్వగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉదారత చాటి రూ.16 కోట్లపైనే విరాళాలు అందించారు. అమెరికా నుంచి ఇంజక్షన్‌ తెప్పించి బాలుణ్ని కాపాడారు. నగరం కేంద్రంగా నలుగురు పిల్లలకు ఇలాంటి చికిత్స అందించారు. ప్రస్తుతం మరో చిన్నారి చికిత్సకు సిద్ధమవుతున్నారు.


లక్షణాలు త్వరగా గుర్తించాలి

డా.రమేష్‌, పీడియాట్రిక్‌ న్యూరోఫిజీషియన్‌, రెయిన్‌బో ఆసుపత్రి

పిల్లలు ఎదిగేప్పుడు కాళ్లు, చేతులు ఆడించలేకపోవడం.. మెడ నిలబెట్టలేకపోవడం లాంటి లక్షణాలుంటే ఈ వ్యాధిగా అనుమానించాలి. మేనరికం, దగ్గరి బంధుత్వం ఉన్న వారి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ. రెండేళ్లవయసు లోపు చికిత్స అందించాలి. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 3-4 ఏళ్లు పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని