logo

Hyderabad news : కట్టుడు లేక.. కట్టడి చేయలేక

జీడిమెట్ల దగ్గర ఉన్న ఫాక్స్‌సాగర్‌ చెరువు అలుగు పొంగి ఉమామహేశ్వర కాలనీతోపాటు అనేక చోట్ల మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 2.7 కిలో మీటర్ల పొడవున రూ.95 కోట్లతో వరద నాలాల విస్తరణ పనులను కొన్ని నెలల కిందట మొదలుపెట్టారు.

Updated : 08 Aug 2022 06:54 IST
నాలాల నిర్మాణంలో జాప్యం
ఈసారీ ముంపులోనే కాలనీలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
2020లో వరదల వల్ల ముంపునకు గురైన ఉమామహేశ్వర కాలనీ

జీడిమెట్ల దగ్గర ఉన్న ఫాక్స్‌సాగర్‌ చెరువు అలుగు పొంగి ఉమామహేశ్వర కాలనీతోపాటు అనేక చోట్ల మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 2.7 కిలో మీటర్ల పొడవున రూ.95 కోట్లతో వరద నాలాల విస్తరణ పనులను కొన్ని నెలల కిందట మొదలుపెట్టారు. ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇటీవల వర్షాలకే ఈ కాలనీలు ముంపు ముంపులోకి వెళ్లిపోయాయి.

కొద్ది రోజులుగా రాజధానిలోని వందల కాలనీల ప్రజలు వర్షం అంటేనే ఉలిక్కిపడుతున్నారు. గంట వ్యవధిలో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం దంచికొడుతుండటంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరుతుందోనని వేలాది కుటుంబాలు నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోంది. ముంపుతో ఇబ్బంది పడుతున్న కాలనీలు ఉన్న ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు పూర్తి చేయని హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఇంజినీరింగ్‌ అధికారులే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి.

గత ఏడాది వర్షాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నాలాల నిర్మాణంతోపాటు మరికొన్ని చోట్ల విస్తరణ పనులను మొదలుపెట్టింది. దీనికి రూ.950 కోట్లు కేటాయించింది. బల్దియాతోపాటు సమీప పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నగర పరిధిలో ఈ విస్తరణకు సంబంధించి 60 పనులను గత వేసవిలో మొదలు పెట్టాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల 37 మాత్రమే మొదలయ్యాయి. కొన్ని పనులు ఏడాది కిందటే మొదలైనా కనీసం 20 శాతం కూడా పూర్తవలేదు. ముంపు నివారణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఏడెనిమిది నెలల కింటే ఆదేశించారు. అధికారులు మొత్తం పనులు కాకపోయినా కాలనీలను ముంచెత్తుతున్న ప్రాంతాల్లోనైనా విస్తరణ పూర్తి చేసి ఉంటే సమస్య తీరేదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ వాస్తవ పరిస్థితి..

* జీడిమెట్ల వెన్నెలగడ్డ చెరువు నుంచి గోదావరి హోమ్స్‌ మీదుగా కెమికల్‌ నాలా వరకు 2.7 కిలో మీటర్ల వరద నీటి కాల్వ నిర్మాణం పనులను ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు.

* నెక్నాంపూర్‌ నాలా నుంచి మూసీ వరకు ఉన్న రూ.24 కోట్లతో నాలా విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇవి కూడా నత్తకు నడకలు నేర్పుతున్నాయి.

* నాగిరెడ్డి చెరువు కాప్రా లేక్‌ మధ్య రూ.41 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా జరగడం లేదు. రసూల్‌పురా మెయిన్‌ రోడ్డు కరాచీ బేకరీ దగ్గర రూ.10 కోట్లతో చేపట్టిన కల్వర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని