logo
Updated : 09 Aug 2022 09:39 IST

Hyd News: చావు రహస్యం సమాధి

నగరంలో అంతుచిక్కని అనుమానాస్పద మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌

కడుపునొప్పి తాళలేక గృహిణి బలవన్మరణం.. అమ్మ తిట్టిందని ఆత్మహత్యకు పాల్పడిన బాలిక.. మరుగుదొడ్డిలో నిర్జీవంగా పడి ఉన్న యువతి.. తరచూ ఏదో మూలన మృతికి పోలీసు రికార్డుల్లో కనిపించే కారణాలు. మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో ఏటా 100-110 వరకూ అనుమానాస్పద మరణాలు నమోదవుతుంటాయని అంచనా. తమ ఆత్మీయుల చావుల వెనుక వాస్తవాలు కావాలంటూ బాధిత కుటుంబాల్లో కొందరు ఠాణాల చుట్టూ తిరుగుతుంటారు. అధికశాతం తమ తలరాత ఇంతేనంటూ వెనక్కి తగ్గుతున్నారు. వివాహేతర సంబంధాలు, ప్రేమ, సహజీవనం అంశాల్లో ఆత్మహత్యకు పురిగొల్పుతున్న మృగాళ్లు ఆధారాలు దొరక్కుండా వ్యవహరించి తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బలవన్మరణంగా మొదట కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో లభించిన ఆధారాలతో హత్యలుగా నిర్ధారిస్తున్నారు. ఎవరు చేశారనేది? గుర్తించడంలో తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి.

కేసు దర్యాప్తులో ఉందంటూ..!
పుప్పాలగూడ అపార్ట్‌మెంట్‌లో పొరుగు రాష్ట్రానికి చెందిన యువతీ యువకుడు సహజీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ మాదకద్రవ్యాలు తీసుకొనే అలవాటుందంటారు స్నేహితులు. ఒకరోజు యువతి స్నానాల గదిలో అపస్మారకస్థితిలో పడి ఉంది.  ఆసుపత్రికి తరలించేలోపు మరణించింది. అతిగా మత్తుపదార్థాలు ఇచ్చారా, తీసుకుందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. నార్సింగిలో ఓ గృహిణి పడక గదిలో తనువు చాలించింది. ఉద్యోగనిమిత్తం దూర ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా మూడ్రోజులు భార్యతో మాట్లాడలేదు. పోలీసులు ఫోన్‌ చేసేంత వరకూ అతడికి భార్య చనిపోయినట్లు తెలియదంటూ చెప్పుకొచ్చాడని సమాచారం. మల్కాజిగిరి జోన్‌ పరిధిలో మానసికస్థితి సరిగా లేని కుమారుడు, వయసుమీరిన తల్లి ఉంటున్నారు. ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి అతికష్టమ్మీద లోపలకు ప్రవేశించి వయోధికురాలి మృతదేహాన్ని గుర్తించారు. తల్లి శవం పక్కనే కొడుకు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.  ఆమె అనారోగ్యంతో  మరణించిందా.. ఆత్మహత్య చేసుకుందా అనేది సమాధానం దొరకని ప్రశ్నగా ఉంది. గతేడాది  తుర్కయాంజల్‌లో ఓ భవనంలో లభించిన మొండెం కలకలం సృష్టించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడిదిగా గుర్తించారు. ఘటన జరిగి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ అది నరబలా! హత్యా అనేది పోలీసులు నిర్ధారించలేకపోయారు. కొన్ని అనుమానాస్పద మరణాలు హత్యలుగా గుర్తించినా నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ, ఆర్ధికబలం ఉపయోగించి కేసులు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా కేసులపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తులో ఉందంటూ.. వాస్తవాలు బయటపడేందుకు సమయం పడుతుందంటూ తప్పించుకోవడం కొసమెరుపు.

ఎక్కడో హత్యలు.. ఇక్కడ శవాలు
ఇటీవల జీడిమెట్ల వద్ద బహళ అంతస్తు భవనంపై నుంచి కిందకు దూకి బాలిక ఆత్మహత్య చేసుకొంది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తర్వాత అకస్మాత్తుగా కేసు ముగిసింది. ఎల్బీనగర్‌లో ఇటీవల ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడటం వల్ల బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అంచనా వేశారు. తల్లిదండ్రులు కూడా విషాదంలో ఉండటంతో వారిని ప్రశ్నించేందుకు పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. నాలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ మృతదేహాలు కనిపిస్తుంటాయి. మృతుల ఆనవాళ్లు లేకుండా కాల్చడం, ముఖాన్ని చెక్కేసి అక్కడ పడేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా మృతుల ఆధారాలు లభించక శవాగారాల్లో భద్రపరుస్తున్నారు. ఆస్తితగాదాలు, వివాహేతర సంబంధాలు, ప్రతీకారంతో చంపేసిన తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని