ఎస్సై అభ్యర్థిని కోమాలోకి పంపారు

నిరుపేద కుటుంబ నేపథ్యం. డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. పోలీసు కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్‌ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడు. అంతాబాగుంటే ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడే..!

Updated : 09 Aug 2022 05:22 IST

చికిత్స పొందుతున్న వెంకటేష్‌

ఈనాడు- హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబ నేపథ్యం. డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. పోలీసు కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్‌ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడు. అంతాబాగుంటే ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడే..! పరీక్ష రాయాల్సిన అభ్యర్థి.. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో క్యాబ్‌ కిరాయి అడిగినందుకు ఇటీవల దాడికి గురైన వెంకటేష్‌ నేపథ్యమిది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌.. బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటూ క్యాబ్‌ నడుపుతున్నాడు. అతనిపై దాడి జరగడంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. వెంకటేష్‌కు చికిత్స కోసం ఇప్పటికే రూ.10లక్షల వరకు ఖర్చయిందని.. ఆర్థికంగా భారమవడంతో సోమవారం మరో ఆసుపత్రికి మార్చామని కుటుంబ సభ్యులు ‘ఈనాడు’కు చెప్పారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితులు పర్వతాలు కోలుకుంటున్నట్లు తెలిపారు.

తప్పించేందుకు రాయబారాలు
వెంకటేష్‌పై దాడి అనంతరం కోర్టులో లొంగిపోయిన వివేక్‌రెడ్డిని రాజేంద్రనగర్‌ పోలీసులు రెండ్రోజులు విచారించి సోమవారం తిరిగి రిమాండ్‌కు తరలించారు. దాడికి పాల్పడిన 12 మంది పేర్లను వివేక్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. దాడి చేసిన మరికొందర్ని తప్పించడానికి వివిధ పార్టీల పెద్దలు రంగంలోకి దిగి రాయబారం చేస్తున్నట్లు తెలిసింది. సుమారు 20మంది వరకు దాడి చేస్తున్నట్లు సీసీ పుటేజీలలో కనిపిస్తోంది. దాడిలో కొన్ని పుటేజీలను పోలీసులకు దొరక్కుండా స్థానికంగా కొందరు తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి ఘటన ‘ఈనాడు’ ద్వారా వెలుగులోకి రావడం.. పోలీసు ఉన్నతాధికారుల దృష్టి పడటంతో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్న పలువురిని సోమవారం ప్రశ్నించారు. వారందరిపైనా కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ నాగేంద్రబాబు తెలిపారు. దాడిలో గాయపడ్డ వెంకటేష్‌ తండ్రి అంజయ్య సోమవారం రాజేంద్రనగర్‌ ఠాణాకు వచ్చి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని