logo

భాజపా నేత జ్ఞానేంద్రప్రసాద్‌ బలవన్మరణం

భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మునుగూరి వెంకట జ్ఞానేంద్రప్రసాద్‌(48) బలవన్మరణానికి పాల్పడ్డారు. మియాపూర్‌ ఇంద్రారెడ్డి ఆల్విన్‌కాలనీలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని

Published : 09 Aug 2022 03:18 IST

మియాపూర్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మునుగూరి వెంకట జ్ఞానేంద్రప్రసాద్‌(48) బలవన్మరణానికి పాల్పడ్డారు. మియాపూర్‌ ఇంద్రారెడ్డి ఆల్విన్‌కాలనీలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐరాల మండలం కామినేనిపల్లికి చెందిన ఆయన 20 ఏళ్లుగా మియాపూర్‌లో ఉంటున్నారు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు భాజపా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ ఏడాది జూన్‌ 2న సంగారెడ్డి జిల్లా జోగిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడడంతో.. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. నాటి నుంచి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన భాజపా కార్యవర్గ సమావేశాల సందర్భంగా పలువురు ముఖ్యనేతలు ఆయన్ను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. సోమవారం ఉదయం జ్ఞానేంద్రప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారంతో.. ఆ పార్టీ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్‌యాదవ్‌, యోగానంద్‌, గోవర్ధన్‌గౌడ్‌, మహేష్‌యాదవ్‌, శ్రీనివాస్‌, బుచ్చిరెడ్డి, నాగేశ్వర్‌గౌడ్‌, పలువురు నాయకులు, పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్‌ సైతం సంతాపం తెలియజేశారు. మంగళవారం ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. జ్ఞానేంద్రప్రసాద్‌ ఆత్మహత్యపై భార్య సౌమ్యశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మానసిక కుంగుబాటా? కారణామా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని