logo

చెరువు.. కనుమరుగు

ఈ చిత్రం చూడండి.. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2016లో.. హైటెక్‌ సిటీ సమీపంలోని గుట్టలబేగంపేట ప్రాంతం గూగుల్‌ మ్యాప్‌లో ఇలా ఉంది. అప్పట్లో అక్కడ ఓ చెరువు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో చెరువు ఉన్న ప్రాంతంలో పచ్చదనం ఉంది

Published : 09 Aug 2022 03:31 IST

ఒకప్పుడు తటాకం.. ప్రస్తుతం మాయం
గుట్టల బేగంపేటలో అదృశ్యమైన నీటి వనరు

ఈనాడు, హైదరాబాద్‌

ఈ చిత్రం చూడండి.. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2016లో.. హైటెక్‌ సిటీ సమీపంలోని గుట్టలబేగంపేట ప్రాంతం గూగుల్‌ మ్యాప్‌లో ఇలా ఉంది. అప్పట్లో అక్కడ ఓ చెరువు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో చెరువు ఉన్న ప్రాంతంలో పచ్చదనం ఉంది. వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరి కొన్ని నెలలపాటు నిల్వ ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

ఇది ప్రస్తుతం తీసిన చిత్రం. ఆరేళ్ల తర్వాత అక్కడ చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. పచ్చదనం కనుమరుగై నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. చుట్టు పెద్దఎత్తున నిర్మాణాలు రావడంతో నీరు పారే వరద కాల్వలు కనుమరుగై చెరువు మాయమైన పరిస్థితి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ ధరణి వెబ్‌సైట్‌లో ఇంటి స్థలాల కింద ఉన్నట్లు చేర్చారు.


హైటెక్‌ నగరంలో మరో నీటి వనరు మాయమైంది. ఆక్రమణలతో చెరువు ఆనవాళ్లు పూర్తిగా కోల్పోయింది. ఆరేళ్లలో రూపురేఖలే లేకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయింది. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నం.7, 8, 9, 32, 33 సర్వే నంబర్లలో చెరువు విస్తరించి ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దాదాపు 62 ఎకరాల్లో ఇది విస్తరించి ఉండగా, ప్రస్తుతం సర్వే నం.7, 8, 9, 32లోని 48.06 ఎకరాల్లో నీటి వనరు పూర్తిగా మాయమైంది. 2016 నుంచి మొదలుకుని వరుసగా సేకరించిన గూగుల్‌ చిత్రాలను పరిగణలోకి తీసుకుంటే చెరువు ఏటా కుంచించుకుపోయిన పరిస్థితి స్పష్టమవుతోంది. ఇప్పుడు ఏకంగా.. ధరణి వెబ్‌సైట్‌లో సర్వే నం.7, 8, 9, 32లో ఇంటి స్థలాలున్నట్లు నమోదైంది. చెరువును పునరుద్ధరించకుండా ఏకంగా ఇంటి స్థలాలుగా మార్పు చేయడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతం నుంచి అడ్డంగా రహదారి నిర్మాణం సైతం జరిగింది.

వరదకాల్వలు మాయం!
గుట్టలబేగంపేట చెరువులోకి సున్నంచెరువు నుంచి వరద కాల్వలు అనుసంధానంగా ఉండేవి. సున్నంచెరువులో నీరు నిండిన తర్వాత ఇక్కడికి వచ్చి చేరేది. నీటి ప్రవాహానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది. వరద కాల్వలు ఆక్రమణకు గురికావడంతో ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నీరు రాకుండా నిలిచిపోయి గుట్టలబేగంపేట చెరువే మాయమైపోయింది.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
- లుబ్నా సార్వత్‌, సామాజిక ఉద్యమకారిణి

చెరువు ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇలా నీటి వనరులు మాయమైతే భవిష్యత్తులో పుస్తకాల్లోనే చదువుకోవాలి. అధికార యంత్రాంగం చెరువును పునరుద్ధరించాలి. ప్రస్తుతం వేసిన రోడ్డు వంతెన రూపంలోకి వచ్చే అవకాశముంది. చెరువు, వరద కాల్వలను పునరుద్ధరిస్తే వరదల నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని