logo

విద్యార్థులు... సైబర్‌ అంబాసిడర్లు..!

రోజువారీ జీవనంలో చరవాణి ఎంత విస్తృతమైందో మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు నిర్వహించక పోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా అనివార్యంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సి వచ్చిన విషయం అందరికీ విదితమే.

Published : 10 Aug 2022 01:13 IST

ఎంపికైన వారికి ముగిసిన శిక్షణ
కార్యాచరణకు సన్నాహాలు
న్యూస్‌టుడే, వికారాబాద్‌  

శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు  

రోజువారీ జీవనంలో చరవాణి ఎంత విస్తృతమైందో మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు నిర్వహించక పోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా అనివార్యంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సి వచ్చిన విషయం అందరికీ విదితమే. దీంతో ఆన్‌లైన్‌ తరగతులకు ప్రధానంగా చరవాణి, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌లను వినియోగించాల్సి వచ్చింది. వీటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండటంతో విద్యార్థులు సైబర్‌ మోసగాళ్ల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతేడాది సూర్యాపేట జిల్లా కోదాడలో తండ్రి మొబైల్‌లో ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ తరగతులు వింటుండగా, సెల్‌ఫోన్‌కు ఓ ఓటీపీ వచ్చింది. సైబర్‌ మోసగాడు ఫోన్‌ చేసి అడగ్గా ఆ విద్యార్థి ఓటీపీ సంఖ్య చెప్పిందే తడువుగా అతడి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. దీంతో పాటు సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ ఆటలతో పిల్లలు వేధింపులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని గుర్తించిన పోలీస్‌శాఖ విద్యార్థుల కోసం 10 నెలల క్రితం సైబర్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇటీవలే శిక్షణ పూర్తయింది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

మోసాల బారిన పడకూడదని..
సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు, వేధింపులు, బెదిరింపులకు పిల్లలు గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసుశాఖ, మహిళా భద్రతా విభాగం అధికారులు సైబర్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. షీ బృందం, విద్యాశాఖ, యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాలోని 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, వారికి ఒక ఉపాధ్యాయుడు మెంటర్‌గా ఉన్నారు. ఇద్దరు విద్యార్థుల్లో 8, 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక, ఒక బాలుడు ఉన్నారు. వీరికి 10 నెలల పాటు ఆన్‌లైన్‌లో జరుగుతున్న సైబర్‌ నేరాలు, మోసాల బారిన పడకుండా వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చారు.

రక్షిత్‌ టాండన్‌ తరగతులు..
జిల్లాలో సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్‌ నిపుణుడు రక్షిత్‌ టాండన్‌ నేతృత్వంలో 10 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థులను సైబర్‌ మోసాలను పసిగట్టడంలో నిష్ణాతులుగా తీర్చి దిద్దారు. ఆన్‌లైన్‌ ద్వారా మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. వారం వారం విద్యార్థులు, మెంటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లలు మంచి కోసం ఇంటర్నెట్‌ను వినియోగించేలా అవగాహన పెంపొందించేందుకు సైబర్‌ అంబాసిడర్ల ద్వారా కార్యకలాపాలకు రూపకల్పన చేయనున్నారు. పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడానికి శిక్షణలో భాగంగా సర్వేను సైతం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు ఇంటర్నెట్‌ను వినియోగించే సమయంలో సురక్షిత వాతావరణం కల్పించేలా అవగాహన కల్పించారు. ఇంటర్నెట్‌ నిపుణులతో అభిప్రాయాలను పంచుకునేలా సైబర్‌ అంబాసిడర్లకు శిక్షణ ఇచ్చారు. తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న వారితో మిగతా విద్యార్థులకు సైతం ఈ సైబర్‌ అంబాసిడర్లు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేలా పోలీసుశాఖ ప్రణాళిక రూపొందించింది.


సమన్వయంగా ముందుకు వెళ్తాం: ఎన్‌.కోటిరెడ్డి, జిల్లా పోలీసు అధికారి
సైబర్‌ నేరాలను అరికట్టడానికే సైబర్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టును రూపొందించాం. జిల్లాలో ఈ ప్రాజెక్టును వంద మంది విద్యార్థులకు నిపుణులతో శిక్షణ ఇప్పించి విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మెంటర్లను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారి ద్వారా జిల్లాలో మిగిలిన విద్యార్థులను సైతం సైబర్‌ అంబాసిడర్లుగా రూపొందించడానికి విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు