logo

ఇల్లు వస్తుందా? రాదా?

గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలన అయోమయంగా మారింది. ఔత్సాహికులు 2016లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆరేళ్ల తర్వాత దరఖాస్తుదారులకు ఫోన్‌ చేస్తున్నారు. కొందరు

Published : 10 Aug 2022 02:47 IST

7.5 లక్షల దరఖాస్తుదారుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలన అయోమయంగా మారింది. ఔత్సాహికులు 2016లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆరేళ్ల తర్వాత దరఖాస్తుదారులకు ఫోన్‌ చేస్తున్నారు. కొందరు సిబ్బంది ఆరు రకాల వివరాలు అడుగుతుండగా, మరికొందరు మీరెక్కడున్నారనే ప్రశ్నతో సరిపెడుతున్నారు. చిరునామా తీసుకుని ఫోన్‌ పెట్టేస్తున్నారు. దాంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఇల్లు వచ్చినట్టా, రానట్టా అని తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఆఫీసులకు పయనమవుతున్నారు. మరోవైపు.. ఫోన్‌ నెంబరు సరిగా లేని దరఖాస్తుదారులు, వేరే ప్రాంతానికి నివాసం మార్చుకున్న వారు, ఓటరు గుర్తింపుకార్డు లేని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలేంటో ప్రకటించకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడమే ఆయా సమస్యలకు తావిస్తోంది.

మమ్మల్నీ పరిగణనలోకి తీసుకోండి.. పేదలకు ఇళ్లు అనగానే కలెక్టర్‌ కార్యాలయాల్లో, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులిచ్చారు. నాలుగేళ్ల క్రితం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు ప్రక్రియ నిలిచింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇలా 3 జిల్లాల నుంచి 10 లక్షల దరఖాస్తులందాయి. 7.5 లక్షలను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఇచ్చింది. పరిశీలించి కలెక్టర్ల సాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. కానీ కలెక్టర్‌ కార్యాలయాలు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన వెబ్‌సైట్‌ ద్వారా చేసుకున్న దరఖాస్తులు జీహెచ్‌ఎంసీకి అందలేదు. ఆ రెండు పద్ధతుల్లో అర్జీ పెట్టుకున్న పేదలు లబోదిబోమంటున్నారు.

జవాబుల్లేని ప్రశ్నలు.. 7.5 లక్షల దరఖాస్తులను 30 సర్కిళ్ల ఉపకమిషనర్లకు పంపారు. ఆస్తిపన్ను, ఇతరత్రా విభాగాల సిబ్బంది వాటిని యాప్‌ సాయంతో పరిశీలిస్తున్నారు. పౌరులకు ఫోన్‌ చేసి 6 రకాల వివరాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు, అర్హత ఏంటి, కేటాయింపు ఎలా, కలెక్టర్‌ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుల సంగతేంటి, ఇల్లు మారిన దరఖాస్తుదారులను ఎలా విచారిస్తారు, ఫోన్‌ నెంబరు మారితే ఎలా గుర్తిస్తారు, గ్రామాల్లో ఓటరు గుర్తింపు కార్డు కలిగి నగరంలో ఇల్లు కావాలంటూ వచ్చిన దరఖాస్తులను ఏం చేస్తారు.. వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాల్లేవు.

అసంబద్ధ విభజన..
నగరంలోని పేదలకు 1లక్ష ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. జీహెచ్‌ఎంసీ అధికారులు నియోజకవర్గానికి 4వేల చొప్పున మొత్తం 24 నియోజకవర్గాలకు సమానంగా ఇళ్లు కేటాయిస్తామంటున్నారు. కానీ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పేదలు అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. దాని వల్ల కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, తదితర నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున దరఖాస్తులు అందాయి. ఉదాహరణకు.. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఇళ్ల కోసం 50వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. ప్రధాన నగరంలోని ఓ నియోజకవర్గంలో ఆ సంఖ్య పది వేలు. అందువల్ల నగరం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలనే వాదన వినిపిస్తోంది.

నగరంలో నిర్మించతలపెట్టిన ఇళ్లు: లక్ష
ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి: 65 వేలు
తుది దశలో ఉన్నవి: 20 వేలు
పనులు ఇటీవల మొదలైనవి: 10 వేలు
ప్రారంభోత్సవం జరిగినవి: 5 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని