logo

బ్రిటిష్‌ గుండెల్లో తురుమ్‌ ఖాన్‌.. హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం

ఎవరైనా గొడవకు దిగినా.. పెద్దల్ని ఎదిరించినా ‘‘నువ్వేమైనా తురుమ్‌ ఖాన్‌ అనుకుంటున్నావా’’ అంటూ గద్దిస్తారు. తెగువ ప్రదర్శిస్తున్నారనే అర్థంతో దీన్ని వాడతారు. కాలక్రమంలో తురుమ్‌ఖాన్‌గా పిలుచుకుంటున్న ఆ వీరుడి అసలు

Updated : 10 Aug 2022 08:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎవరైనా గొడవకు దిగినా.. పెద్దల్ని ఎదిరించినా ‘‘నువ్వేమైనా తురుమ్‌ ఖాన్‌ అనుకుంటున్నావా’’ అంటూ గద్దిస్తారు. తెగువ ప్రదర్శిస్తున్నారనే అర్థంతో దీన్ని వాడతారు. కాలక్రమంలో తురుమ్‌ఖాన్‌గా పిలుచుకుంటున్న ఆ వీరుడి అసలు పేరు తుర్రేబాజ్‌ ఖాన్‌..!  ఆయన హైదరాబాదీ అని.. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వీర మరణం పొందారని తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు ఓ కీలకఘట్టం. ఆ  తిరుగుబాటుకు.. నిజాం పాలిత హైదరాబాద్‌కు ముడివేసే ఓ పరాక్రమ వ్యక్తిత్వమే తుర్రేబాజ్‌ ఖాన్‌. ఈస్టిండియా పాలకులకు ముచ్చెమటలు పట్టించి.. చరిత్రలో అంతగా ప్రాధాన్యం దక్కకుండా.. కనీసం చిత్రపటం కూడా అందుబాటులోని పోరాట యోధుడు.

కోఠిలోని స్వతంత్ర వీరుల స్మారకం

వేల మందితో బ్రిటీషర్లపై దండయాత్ర
బేగంబజార్‌కు చెందిన తుర్రేబాజ్‌ఖాన్‌ నిజాం సైన్యంలో  సాధారణ సిపాయి. మీరట్‌లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు సమాంతరంగా హైదరాబాద్‌లో జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారు. సిపాయిల తిరుగుబాటులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి చీదాఖాన్‌ అనే సైనికున్ని పంపగా.. అతను పట్టుబడ్డారు. బ్రిటీష్‌ రెసిడెన్సీలో బంధించిన అతన్ని విడిపించేందుకు తుర్రేబాజ్‌ ఖాన్‌ నేతృత్వంలో దాదాపు 5 నుంచి 6 వేల మంది కోఠిలోని బ్రిటీష్‌ ప్రెసిడెన్సీ(కోఠి మహిళా విశ్వవిద్యాలయం)పై 1857 జులై 17న దాడి చేసేందుకు ఉద్యుక్తులయ్యారు.  రెసిడెన్సీకి పశ్చిమాన ఆనుకుని ఉన్న రెండు ఇళ్ల గోడలను బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే  బ్రిటీష్‌ సైన్యం  ముందు తిరుగుబాటుదారులు నిలవలేకపోయారు. ఆ తర్వాత తుర్రేబాజ్‌ఖాన్‌ పట్టుబడగా యావజ్జీవ శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. 1859 జనవరి 18న జైలు నుంచి తప్పించుకున్నారు. ఈసారి ఆయన్ను పట్టిస్తే రూ.5 వేలు ఇస్తామంటూ బ్రిటీషర్లు ప్రకటించారు. కొందరు ఇచ్చిన సమాచారంతో జనవరి 24న తూప్రాన్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో సైన్యం ఆయన్ను పట్టుకుని కాల్చినట్లు చరిత్రకారులు చెబుతారు. అక్కడి నుంచి మృతదేహాన్ని హైదరాబాద్‌ వరకు తీసుకొచ్చి రెసిడెన్సీ భవనం సమీపంలోని ఓ చెట్టుకు నగ్నంగా వేలాడదీశారు.  స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం  బ్రిటీష్‌ ప్రెసిడెన్సీపై దాడి చేసిన అమరుల గుర్తుగా కోఠిలో స్మారకం నిర్మించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని