logo

స్వరాజ్య పోరులో లక్ష్మి బాలిక విద్యకు సరస్వతి

షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు హత్య చేసినప్పుడు ఆయన ఇంటికెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన యోధురాలు.. భరతమాత విముక్తి కోసం మహిళాలోకాన్ని జాగృతం చేసిన చైతన్యశీలి.. సంగెం లక్ష్మీబాయి. నగరశివారు ఘట్‌కేసర్‌ మండలం

Published : 10 Aug 2022 02:45 IST

స్వాతంత్య్ర పోరాటంలో లక్ష్మీబాయి పాత్ర కీలకం
ఆమె ఏర్పాటు చేసిన సదనంతోనే ఐఎస్‌సదన్‌కు పేరు
ఈనాడు,  హైదరాబాద్‌

షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు హత్య చేసినప్పుడు ఆయన ఇంటికెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన యోధురాలు.. భరతమాత విముక్తి కోసం మహిళాలోకాన్ని జాగృతం చేసిన చైతన్యశీలి.. సంగెం లక్ష్మీబాయి. నగరశివారు ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన ఆమె స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించారు.  

సత్తెమ్మ నుంచి లక్ష్మీబాయిగా..
ఆమె చిన్ననాటి పేరు సత్తెమ్మ. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో అత్తింటివారు లక్ష్మీబాయిగా పేరు పెట్టారు. భర్త మరణానంతరం మేనమామ సీతారామయ్యయాదవ్‌ దత్తత తీసుకుని స్కూల్‌ రికార్డుల్లో ఆమె పేరును సంగెం లక్ష్మీబాయిగా రాయించారు.  గుంటూరులో శారదానికేతన్‌లో చేర్పించి చదివించారు.  హిందీలో సాహితీ, విదూషీ డిగ్రీలు చేశారు. స్వరాజ్య పోరులో లక్ష్మీబాయి చురుగ్గా పాల్గొన్నారు.  1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా తెలుగునాట ఊరూరూ తిరుగుతూ జనాన్ని జాగృతం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, సారా విక్రయాలకు వ్యతిరేకంగా సత్యగ్రహ దీక్షలు చేసి జైలుకు వెళ్లారు. ఆ సమయంలో మహిళల కోసం ప్రత్యేక బ్యారెక్స్‌(గదులు) ఉండాలని పోరాడారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న ఆమెనుఅరెస్టు చేసి ఏడాదిపాటు ఖైదు చేశారు.  

ఇవీ వివరాలు
* జననం: 1911 జులై 27
* తల్లిదండ్రులు: సీతమ్మ, దొంతుల రామయ్య
* భర్త: దుర్గాప్రసాద్‌యాదవ్‌
* విద్యార్హత: బీఏ(ఉస్మానియా విశ్వవిద్యాలయం), చిత్రకళలో డిప్లొమా.
* మరణం: 1979
* పుస్తకం: నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు
* ప్రభుత్వ గుర్తింపు: స్వాతంత్య్ర సమరయోధురాలిగా తామ్రపత్రం అందజేత

భూదానోద్యమ స్ఫూర్తి
ఆచార్య వినోబాభావే భూదానోద్యమంతో స్ఫూర్తి పొంది ఆమె స్వగ్రామం కొర్రెములలోనూ భూములను పేదలకు పంచారు. 1952లో నగరంలోని సంతోష్‌నగర్‌ వద్ద రెండెకరాల్లోని ఇంట్లో స్త్రీ సేవా సదన్‌ను ఏర్పాటు చేశారు.  1955లో ఇందిరాసేవా సదన్‌గా రిజిస్టర్‌ చేయించారు. దీంతో ఆ ప్రాంతానికి ఐఎస్‌సదన్‌గా పేరొచ్చింది  ఆమె చివరి కోరిక మేరకు 1979లో మరణానంతం ఐఎస్‌సదన్‌లో సమాధి చేశారు.

మహిళా విద్యాశాఖ మంత్రిగా..
బూర్గుల మంత్రివర్గంలో 1954-56 మధ్య డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా బాలికల విద్యకు కృషి చేశారు. 1957, 62, 67లో మెదక్‌ లోక్‌సభ నుంచి వరుసగా ఎంపీగా గెలిచి 14 ఏళ్లు ప్రాతినిధ్యం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని