logo

మీ పాస్‌పోర్టు సేవలు భేష్‌

హైదరాబాద్‌ రీజియన్‌ పాస్‌పోర్టు సేవలు కీలకమని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ అన్నారు. సాంకేతికపరంగా, సిబ్బంది లేమి కారణంగా సమస్యలు ఎదురవుతున్నా ఎక్కువ గంటలు

Updated : 10 Aug 2022 06:30 IST

కేంద్ర మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌తో మాట్లాడుతున్న రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి డా.ఎస్‌.బాలయ్య

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రెజిమెంటల్‌బజార్‌: హైదరాబాద్‌ రీజియన్‌ పాస్‌పోర్టు సేవలు కీలకమని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ అన్నారు. సాంకేతికపరంగా, సిబ్బంది లేమి కారణంగా సమస్యలు ఎదురవుతున్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న సిబ్బంది పని తీరును మెచ్చుకున్నారు. కరోనా తర్వాత పాస్‌పోర్టుల జారీ, స్లాట్‌ బుకింగ్‌, సాంకేతికపరంగా రీషెడ్యూల్‌లో ఎదురవుతున్న సమస్యలను రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి (ఆర్‌పీవో) దాసరి బాలయ్య కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం నగరంలో వేర్వేరు కార్యక్రమాలకు హాజరవుతున్న క్రమంలో కేంద్రమంత్రి సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. సరికొత్త ఆలోచనలతో పనులను చకచకా చేస్తున్నారని, ఆఫీసు చూడముచ్చటగా ఉందంటూ కితాబిచ్చారు. సేవల రంగంలో 50 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి, డిజిటలైజేషన్‌, డేటాబేస్‌ తదితరాలతో పోలీస్‌ వెరిఫికేషన్‌, తత్కాల్‌ ప్రక్రియ వేగవంతమయ్యిందన్నారు. దరఖాస్తులు వెల్లువలా వస్తుండటం, సిబ్బంది తక్కువ ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిసిందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ పాస్‌పోర్టుల మంజూరు కోసం హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేసినందుకు అభినందించారు.

జాతీయ పోలీస్‌ అకాడమీలో.. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ ఆకాడమీలో మంగళవారం జరిగిన ‘రీ ఇమాజినింగ్‌ ఇండియా సెక్యూరిటీ’ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించారు. పటేల్‌ 34వ స్మారక ఉపన్యాసంలో భాగంగా ఆయన మాట్లాడారు. అకాడమీ సంచాలకుడు డా.ఏఎస్‌ రాజన్‌తోపాటు ప్రస్తుత, మాజీ ఐపీఎస్‌లు, పారా మిలిటరీ విభాగాధిపతులు, అకాడమీలో ప్రస్తుతం శిక్షణలో ఉన్న 74వ బ్యాచ్‌ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని