logo
Updated : 11 Aug 2022 06:31 IST

పేరు పరిశోధన.. చేసేది డ్రగ్స్‌ తయారీ

ముఠాలో ఇద్దరి అరెస్టు


    శ్రీనివాసరెడ్డి                                     లెనిన్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకరు రసాయన శాస్త్రంలో పీజీ చేసి సీనియర్‌ కెమిస్ట్‌గా అనుభవం సంపాదించాడు. ఇంకొకరి నేపథ్యం బీ ఫార్మసీ. నిషేధిత మాదక ద్రవ్యాల తయారీ మొదలుపెట్టి పోలీసులకు దొరికిపోయారు. సింథటిక్‌ డ్రగ్స్‌ తయారుచేస్తున్న పులిచర్ల శ్రీనివాస్‌రెడ్డి(52), నాంపల్లి లెనిన్‌బాబు(46) ముఠాను భువనగిరి ఎస్‌వోటీ, ఉప్పల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు చెన్నైకి చెందిన నెపోలియన్‌ పరారీలో ఉన్నాడు. వారి నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌, కొకైన్‌ క్యాప్సుల్‌, 3.6 కిలోల ద్రవరూప మాదకద్రవ్యాలు, 50 కిలోల హైడ్రోక్లోరైడ్‌, రెండు కార్లు, రూ.30 లక్షల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ బుధవారం విలేకరులకు తెలిపారు.

ఎన్‌సీబీకి చిక్కినా తీరు మారలేదు

గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన పులిచెర్ల శ్రీనివాసరెడ్డి 1994లో మైసూరులో బీ ఫార్మసీ చేశాడు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసిన ఇతన్ని మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్‌సీబీ 2010లో చెన్నైలో, సింథటిక్‌ డ్రగ్స్‌ తయారీ, సరఫరా కేసులో 2014లో హైదరాబాద్‌లో పట్టుకుంది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద 2015లో, 2018లో నమోదైన కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్నాడు. లెనిన్‌బాబు స్వస్థలం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం గోపాలాయపల్లి. సీనియర్‌ కెమిస్ట్‌గా పనిచేశాడు. 2014లో అక్షజ్‌ మాలెక్యులర్‌ రీసెర్చ్‌ ప్రై. లిమిటెడ్‌ పేరిట నాచారంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతనికి 2017లో శ్రీనివాసరెడ్డి పరిచయమయ్యాడు. సింథటిక్‌ డ్రగ్స్‌ తయారు చేయడంతో ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు లెనిన్‌బాబును అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. శ్రీనివాసరెడ్డి తప్పించుకున్నాడు. 3 నెలలకే బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి మరోసారి డ్రగ్స్‌ తయారీ మొదలుపెట్టాడు. వీటిని చెన్నైలోని నెపోలియన్‌కు సరఫరా చేసేవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని