logo

ఎగిరిన జెండా వెనుక విరిగిన లాఠీలెన్నో

హైదరాబాద్‌ రాజ్యంలో అసఫ్‌జాహీ జెండా మినహా మరే పతాకం ఎగురవేయొద్దంటూ ఆజ్ఞలు ఉన్న రోజులవి. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన రోజున ఎలాగైనా....

Published : 11 Aug 2022 03:59 IST

తెగువ చూపి మువ్వన్నెలు రెపరెపలాడించిన విద్యార్థి నాయకులు

న్యూస్‌టుడే, హిమాయత్‌నగర్‌: హైదరాబాద్‌ రాజ్యంలో అసఫ్‌జాహీ జెండా మినహా మరే పతాకం ఎగురవేయొద్దంటూ ఆజ్ఞలు ఉన్న రోజులవి. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన రోజున ఎలాగైనా జాతీయ జెండాను ఎగురవేయాల్సిందేనని ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎ.హెచ్‌.ఎస్‌.యు.) నిర్ణయించింది. ఈ యూనియన్‌లో సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌వాదులు కూడా ఉండేవారు. సుల్తాన్‌బజార్‌లోని (దిల్‌షాద్‌ థియేటర్‌ ముందు) తమ యూనియన్‌ కార్యాలయంపైన భారత జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరించాలని విద్యార్థులు భావించారు. ఇందుకోసం నెల రోజుల నుంచే విద్యార్థి సంఘం ప్రదర్శనలు నిర్వహిస్తూ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది.

బలగాలు మోహరించినా..

ఖాసీం రజ్వీ నేతృత్వంలోని నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఆగస్టు 15న త్రివర్ణ జెండా ఎగురేయకుండా భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి రఫీ అహ్మద్‌. నిజాం సేనలు పహారా కాస్తున్న సమయంలోనే రఫీ అహ్మద్‌ సైన్యం కళ్లు గప్పి యూనియన్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ సిద్ధంగా ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. దీంతో అక్కడికి విద్యార్థి సంఘం మరో నాయకుడుగా ఉన్న బూర్గుల నర్సింగరావు, ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ వంటివారు పోలీసు లాఠీదెబ్బలను ఎదుర్కొంటూ స్టూడెంట్‌ యూనియన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ భారత జాతీయ జెండాను ఎగరేసి విజయగర్వంతో నినాదాలు చేశారు. ‘1947 ఆగస్టు 15న మా స్టూడెంట్స్‌ యూనియన్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం అనేది గొప్ప విజయంగా భావించాం. పోలీసు లాఠీ దెబ్బల రుచిచూసినా, మాలో జాతీయ భావం ఆ దెబ్బల తాలుకా బాధలను మటుమాయం చేసింది’ అంటూ బూర్గుల నర్సింగరావు మరణానికి కొంత కాలం ముందు తన అనుభవాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.


సుల్తాన్‌బజార్‌లో విద్యార్థి నాయకులు గతంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసిన చోటు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని