logo
Published : 11 Aug 2022 03:59 IST

ఐదంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం

హోటల్‌లో సిలిండర్లు పేలి ముగ్గురికి గాయాలు


కూలిపోయిన హోటల్‌ గోడలు, పక్కనే నియంత్రిక

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: హోటల్‌లో వంటగ్యాస్‌ లీకై మంటలు రేగిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. 20 మందికి పైగా కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం మెరాజ్‌ చౌరస్తాలోని మెరాజ్‌ కాంప్లెక్సులో ఐదు అంతస్తుల భవనం ఉంది. మొదటి అంతస్తులో కింగ్స్‌ రెస్టారెంట్‌ పేరుతో హోటల్‌ ఉంది. వంట గదిలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిలిండర్‌కు అమర్చిన పైపులోంచి గ్యాస్‌ లీకయ్యింది. అక్కడే పని చేస్తున్న కార్మికులు గమనించి మంటలు ఆర్పేందుకు విఫలయత్నం చేయగా.. పక్కనే మరో రెండు సిలిండర్ల పైపులకూ అంటుకున్నాయి. భయాందోళనకు గురైన కార్మికులు బయటికి వస్తుండగా, పెద్ద శబ్దాలు చేస్తూ రెండు సిలిండర్లు పేలాయి. పేలుళ్ల ధాటికి వంటగదికి ఇరువైపులా ఉన్న గోడలు కూలిపోయి కింది అంతస్తులో పార్కు చేసిన వాహనాలపై పడ్డాయి. దాదాపు 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. హోటల్‌లో పనిచేస్తున్న ఫయాజ్‌(45), షిబూ(35), హబీబుల్‌ రహమాన్‌(35)లు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. భయంతో ఐదో అంతస్తులో ఉండిపోయిన 20 మందిని ఫైర్‌ అధికారి నరసింహ, సిబ్బంది ఆదర్శ్‌, అమ్జద్‌, ఏజాజ్‌ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌, పశ్చిమ మండలం డీసీపీ జోయెల్‌ డేవీస్‌, తహసీల్దార్‌ పర్వీన్‌షేక్‌, డిప్యుటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌రెడ్డి, మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ సందర్శించారు. ఈ పేలుడుతో మెహిదీపట్నం-ఆసిఫ్‌నగర్‌ ప్రధాన రహదారిలో దాదాపు గంటన్నర పాటు వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించలేదు. ఐదంతస్తుల కాంప్లెక్సులో ఇతర అంతస్తులోనూ కళాశాల, కోచింగ్‌ సెంటర్లు, డెంటల్‌ ఆస్పత్రి, వ్యాపార సంస్థలున్నాయి. మొహర్రం 11వ రోజు కావడంతో బుధవారం సెలవు. కళాశాల, కోచింగ్‌ సెంటర్లు కొనసాగే సమయంలో పేలుళ్లు సంభవించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటల్‌ గ్రేటర్‌, ఫైర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఓ పోలీసు అధికారి నిర్వాహకుడిపై బహిరంగంగానే మండిపడ్డారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts