logo
Published : 11 Aug 2022 03:59 IST

తప్పుల తడకలు.. తిప్పలు కుప్పలు

మాస్టర్‌ప్లాన్‌పై హెచ్‌ఎండీఏకు 40 వేల ఫిర్యాదులు

సమీకృత బృహత్తర ప్రణాళిక తయారీ ఎప్పుడో?

ఈనాడు, హైదరాబాద్‌

శివార్లలో లేఅవుట్‌ వేసేందుకు ఓ వ్యక్తి హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. మీ లేఅవుట్‌ నీటి వనరు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని తెలిపింది. వాస్తవానికి తన లేఅవుట్‌ సమీపంలో ఎలాంటి నీటి వనరులు లేనప్పటికీ.. ఎందుకు అనుమతులు ఇవ్వడంలేదని ఆ వ్యక్తి హెచ్‌ఎండీఏ అధికారులను కోరారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తెచ్చుకోవాలని సూచించడంతో ఆ పనిలో ఉన్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు మరెందరో ఉన్నారు.

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ తప్పుల తడకగా మారింది. ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. పదేళ్ల క్రితం మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన సమయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆహ్వానించగా, 40 వేల ఫిర్యాదులు అందాయి. జోన్లు, రహదారులు, భూ వినియోగం తదితర కేటాయింపుల్లో పలు లోపాలు దొర్లినట్లు గుర్తించారు. కొన్ని లోపాలను సరిచేశారు. కొన్నింటిని పట్టించుకోలేదు. రెవెన్యూ, గ్రామ పంచాయతీ మ్యాపుల ఆధారంగా కార్యాలయాల్లో కూర్చొని మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడమే లోపాలు తలెత్తడానికి ప్రధాన కారణం కాగా, రెవెన్యూ మ్యాపుల్లో తప్పులు ఉండడం మరో కారణమైంది.

శివార్లు విస్తరిస్తుండటంతో..

నగరం శరవేగంగా విస్తరిస్తోంది. శివారులుగా ఉన్న ప్రాంతాల పదేళ్లలో పూర్తిగా మారిపోతున్నాయి. అనుమతుల కోసం హెచ్‌ఎండీఏను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మాస్టర్‌ ప్లాన్‌లో ఏదైనా భూమి పొరపాటున ఎఫ్‌టీఎల్‌ ఫరిధిలో ఉన్నట్లు చూపిస్తుంటే.. సరిచేయించుకొనేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. నీటి పారుదల శాఖ, కలెక్టర్‌ల నుంచి ఎన్‌వోసీ తీసుకొని ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి. అది క్షేత్రస్థాయి అధికారులకు వెళుతుంది. వారు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. నివేదికపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందితే.. ఎఫ్‌టీఎల్‌ నుంచి తొలగిస్తారు. ఇదంతా పూర్తి కావడానికి నెలల సమయం పడుతోంది.

ముందుకు కదలని ప్రతిపాదనలు

ప్రస్తుత విధానంలో ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ప్లాన్‌ తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ చేసిన ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ-2031 మాస్టర్‌ప్లాన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ, పాత హుడా, ఎంసీహెచ్‌, ఎయిర్‌పోర్టు బృహత్తర ప్రణాళికలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట వీటిని తయారు చేశారు. అప్పటికీ ఇప్పటికీ నగరం చాలా మారిపోయింది. వీటన్నంటినీ కలిపి రానున్న 50 ఏళ్లకు సరిపడా కొత్త ప్రణాళిక తయారు చేయాలనేది ప్రణాళిక. గూగుల్‌ మ్యాప్‌లు, ఎన్‌జీఆర్‌ఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఇక్రిశాట్‌ సాయంతో పకడ్బందీగా తయారు చేస్తే.. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు అంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని