logo

రండి... విధుల్లో చేరండి

క్షేత్ర సహాయకులు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు బుధవారం పిలుపు అందింది. రెండేళ్లుగా వీరు ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.

Updated : 11 Aug 2022 04:06 IST

ఉపాధి క్షేత్ర సహాయకులకు పిలుపు

374 మందికి అవకాశం

పరిగి, న్యూస్‌టుడే: క్షేత్ర సహాయకులు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు బుధవారం పిలుపు అందింది. రెండేళ్లుగా వీరు ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు పిలుపు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత గడువు పూర్తయి వందలాది మంది ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా పడిన పాట్లు వర్ణనాతీతం. తిరిగి తమను విధుల్లోకి చేర్చుకోవాలని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లడం, సానుకూల స్పందన రావడం జరిగినా ఎక్కువ సమయం తీసుకునే సరికి ఆవేదన చెందారు. నేటి నుంచి క్షేత్ర సహాయకులందరూ విధుల్లోకి హాజరు కావాలని మౌఖిక ఆదేశాలు జారీ కావడంతో ఉపాధి దొరికిందని ఆనందంతో పొంగిపోతున్నారు. మూడు రోజుల్లోగా సంబంధిత మండల అభివృద్ధి అధికారుల వద్ద జాయిన్‌ కావాలని సూచించారు. కనికరించిన సర్కారు మళ్లీ నిరసనలు చేయరాదని చేస్తే ఊరుకునేది లేదని కూడా ఇప్పటికే హెచ్చరించింది.

78లక్షల పనిదినాలు లక్ష్యంగా..

గ్రామాల్లో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మేట్లు, గ్రామ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. కార్యదర్శులకు ఇక అదనపు భారం తగ్గనుంది. ఇతర అభివృద్ధి పనుల పట్ల దృష్టి సారించేందుకు వీలుంటుందని పలువురు కార్యదర్శులు చెబుతున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో 374 మంది క్షేత్ర సహాయకులు త్వరలోనే విధులకు హాజరు కానున్నారు. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 566 గ్రామ పంచాయతీల పరిధిలో 1,91,150 జాబ్‌ కార్డులు ఉన్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరాంతానికి అధికార యంత్రాంగం 78లక్షల పనిదినాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఎనమిదో విడత హరితహారం పనులు ఊపందుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 3వేల మంది మాత్రమే కూలీలు పనిచేస్తున్నారు. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇకమీదట పనులను క్షేత్రసహాయకులు పర్యవేక్షిస్తారు. దీంతో కూలీల సంఖ్య కాస్త పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.


జవాబుదారీతనంతో వ్యవహరిస్తాం

- టి.చంద్రశేఖర్‌, జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు

రెండేళ్లుగా ఉపాధి కొరవడి అనేక మంది బతుకులు బజారున పడ్డాయి. చివరకు ముఖ్యమంత్రి విధులకు పిలుపు నివ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది. కూలీలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగా వ్యవహరించాం. బాధ్యతగా పనిచేస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తాం. విధుల్లోకి తీసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.


ఎంపీడీఓల వద్ద రిపోర్టు చేయాలి

- కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. క్షేత్రసహాయకులందరూ సంబంధిత ఎంపీడీఓల వద్ద రిపోర్టు చేయాలి. వారి సహకారంతో జిల్లా వ్యాప్తంగా హరితహారం పనులను మరింత వేగవంతం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని